
- 388 మందిని వెనక్కి పంపింది
- అమెరికా నుంచి డిపోర్ట్ అయిన
- వారి వివరాలు పార్లమెంటులో వెల్లడి
న్యూఢిల్లీ: అమెరికా జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు 388 మంది భారతీయులను డిపోర్టేషన్ చేసిందని ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. ఇందులో 333 మందిని ఫిబ్రవరిలో మూడు వేర్వేరు సైనిక విమానాలలో అమెరికా నుంచి తీసుకొచ్చారని తెలిపింది. వాణిజ్య విమానాల్లో పనామా ద్వారా 55 మంది ఇండియన్లను తీసుకొచ్చారని చెప్పింది. ఈమేరకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లోక్ సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ వివరాలను వెల్లడించారు.
అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు డిపోర్టేషన్ కానున్న మరో 295 మందికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వంతో పంచుకున్నారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం వారు కస్టడీలో ఉన్నారని చెప్పారు. ఇతర సంబంధిత ఏజెన్సీలతో కలిసి విదేశాంగ శాఖ వివరాలను వెరిఫై చేస్తోందన్నారు.