శంషాబాద్​లో 39 హోర్డింగులు తొలగింపు

శంషాబాద్​లో 39 హోర్డింగులు తొలగింపు

శంషాబాద్, వెలుగు: శంషాబాద్​మున్సిపాలిటీలో పర్మిషన్​లేకుండా ఏర్పాటు చేసిన 39 హోర్డింగులను తొలగిస్తున్నామని, బిల్డింగ్​యజమానులపైనా చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. శుక్రవారం ఉదయం శంషాబాద్​లో నేషనల్​హైవేకు ఇరువైపులా బిల్డింగ్స్​పై ఉన్న హోర్డింగులను ఆయన పరిశీలించారు. అనంతరం హైడ్రా అధికారులు తొలగింపును ప్రారంభించారు. 

హోర్డింగుల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని రంగనాథ్​తెలిపారు. అనుమతులు లేకుండా 39 ఏర్పాటు చేశారని, కొన్ని ఏజెన్సీలు ఒకదానికి పర్మిషన్​తీసుకుని 3,4 ఏర్పాటు చేశాయని తెలిపారు. విచారణ అనంతరం బిల్డింగ్​యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు. హైడ్రా సీఐ రవికుమార్, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, టౌన్ ప్లానింగ్ అధికారి మనోహర్, హైడ్రా సిబ్బంది పాల్గొన్నారు. 

సూరం చెరువు పరిశీలన 

తుక్కుగూడ: మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ సూరం చెరువు కబ్జాకు గురవుతోందని ఫిర్యాదులు అందడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కలిసి చెరువును పరిశీలించారు. 60 ఎకరాలకు మించి ఉండాల్సిన చెరువు, కబ్జాల కారణంగా 25 ఎకరాలకు చేరిందని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని కమిషనర్​వారితో చెప్పారు.