![అక్రమంగా 39 లక్షల ఓట్లను చేర్చారు.. అందుకే బీజేపీ కూటమి గెలిచింది.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ](https://static.v6velugu.com/uploads/2025/02/39-lakh-votes-were-added-illegally-thats-why-the-bjp-alliance-won-alleges-rahul-gandhi_EacDIGuyMU.jpg)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని మార్చడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 32 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారని అన్నారు. లోక్‌సభ--- అసెంబ్లీ ఎన్నికలకు మధ్య గ్యాప్ లో 39 లక్షల కొత్త ఓటర్లు చేరారని, ఈ కొత్త ఓటర్లు ఎవరని ప్రశ్నించారు. ఇది హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని మొత్తం ఓటర్ల సంఖ్యతో సమానమని అన్నారు.
తమకు లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు తేడా లేదని, కానీ ఎన్డీఏ కూటమి పార్టీలకు అదనంగా ఓట్లు వచ్చి చేరాయని అన్నారు. అదనంగా వచ్చిన ఆ ఓట్లే కూటమి పార్టీలకు (మహాయతి) విజయాన్ని అందించాయని తెలిపారు. కొత్తగా చేరిన ఓటర్ల జాబితా, వారి ఫొటోలు, చిరునామాలు అందించాలని ఎన్నికల కమిషన్‌ను రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Also Read :- 12 యూనివర్శిటీలు క్లోజ్.. లోక్ సభలో వెల్లడించిన కేంద్రం
ఇదంతా ఒకెత్తయితే చాలా చోట్ల దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు చెందిన ఓటర్ల పేర్లను తొలగించారని, పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తినప్పటికీ ఈసీ నుంచి సమాధానం రాలేదని తెలిపారు. ఈ విషయంలో తాము ఎలాంటి ఆరోపణలు చేయడం లేదని.. గణాంకాలు, డేటా ముందు పెట్టి సందేహాలను నివృత్తి చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్ కు ఉందని గుర్తు చేశారు.