ఓఆర్ఆర్ ​పరిధిలో 39 సీవరేజ్ ట్రీట్​మెంట్​ప్లాంట్స్

ఓఆర్ఆర్ ​పరిధిలో 39 సీవరేజ్ ట్రీట్​మెంట్​ప్లాంట్స్
  • రూ.3,849.10 కోట్లతో నిర్మించేందుకు ప్రభుత్వ ప్లాన్
  • ఉమ్మడి ఏపీలో ఉన్నవి 25 మాత్రమే 
  • బీఆర్ఎస్​ హయాంలో 31 పనులు ప్రారంభం
  • పూర్తిచేసి ఓపెన్​ చేసింది నాలుగే.. 

హైదరాబాద్, వెలుగు: మూసీ నదిలో మురుగు నీరు పారకుండా ప్రభుత్వం మూసీ రివర్​డెవలప్​మెంట్​ప్రాజెక్టును చేపడుతోంది. ఈ ప్రాజెక్టు ప్రారంభానికి ముందే నది పొడవునా ఎస్టీపీ(సీవరేజ్​ ట్రీట్​మెంట్​ప్లాంట్స్)లు నిర్మించాలని భావిస్తోంది. గ్రేటర్​ పరిధిలో ఇప్పటికే ఉన్న ఎస్టీపీలకు తోడు ఓఆర్ఆర్​పరిధిలో 39 ఎస్టీపీల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 

ఉమ్మడి ఏపీలో 25 ఎస్టీపీలుండగా, తెలంగాణ ఏర్పడ్డాక మూసీని మంచినీటి సరస్సుగా మారుస్తామని అప్పటి సీఎం కేసీఆర్ ​ప్రకటించారు. మూసీ రివర్​ఫ్రంట్​డెవలప్​మెంట్​కార్పొరేషన్​ఏర్పాటు చేసి 31 ఎస్టీపీల నిర్మాణం మొదలుపెట్టారు. కోకాపేట, దుర్గం చెరువు, పెద్ద చెరువు, నల్లచెరువు ఎస్టీపీలు మాత్రమే పూర్తి చేయగలిగారు. 

నాగోలు, ఫతేనగర్, మీరాలం, ఖాజాకుంట, మియాపూర్​, పటేల్​ చెరువు, సఫిల్​గూడ ఎస్టీపీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని మాత్రం ప్రకటించారు. 20 మురుగు నీటి శుద్ధి కేంద్రాలను పూర్తి చేయలేకపోయారు. ప్రస్తుత కాంగ్రెస్​ సర్కారు 20 ఎస్టీపీలను పూర్తిచేసే బాధ్యతను తీసుకుంది. డిసెంబర్​లోపు వీటిని కంప్లీట్​చేయాలని మెట్రోవాటర్ ​బోర్డుకు బాధ్యత అప్పగించింది. 

1950 ఎంఎల్డీల మురుగు

గ్రేటర్​లో రోజుకు 1950 ఎంఎల్డీల మురుగు ఉత్పన్నమవుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ మురుగు మూసీలోకి నేరుగా వెళ్లడంతో మురికి కూపంగా మారింది. జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు 1650 ఎంఎల్డీలు ఉత్పత్తి అవుతుండగా ఇప్పటికే ఉన్న ఎస్టీపీల ద్వారా పూర్తి స్థాయిలో శుద్ధి చేయలేకపోతున్నారు. ఓఆర్​ఆర్​​ పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో కూడా ఎస్టీపీలు నిర్మించేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్ణయించింది. 

రూ. 3,849.10 కోట్లతో 39 ఎస్టీపీలను  నిర్మించేందుకు పరిపాలనా అనుమతులు కూడా జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిని ఓఆర్ఆర్​వరకూ విస్తరించాలని నిర్ణయిం చిన నేపథ్యంలో అర్బన్​లోకల్ బాడీ (యూఎల్ బీ) కింద ఓఆర్ఆర్​ పరిధిలోని ఏడు మున్సిపాలిటీలు, 22 మున్సిపాలిటీలు, 32 గ్రామ పంచాయితీల పరిధిలో 39 ఎస్టీపీలను నిర్మించనుంది. వీటి నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వనుంది. 

ఒక ఎస్టీపీని ప్రైవేట్​పబ్లిక్​ భాగస్వామ్యంతో నిర్మించనుండగా, మరో 38 ఎస్టీపీలను హైబ్రిడ్ ​హామిట్ ​మోడ్​ పద్ధతిలో  నిర్మించనున్నట్టు అధికారులు తెలిపారు. ప్యాకేజీ-1లో 16 ఎస్టీపీలు, ప్యాకేజ్​-2లో 22 నిర్మిస్తారు. దీని వల్ల రోజుకు దాదాపు 972 ఎంఎల్డీల మురుగునీటిని శుద్ధి చేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇవన్నీ పూర్తయితే గ్రేటర్ లో వంద శాతం ముగురునీరు శుద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. 

ప్యాకేజీల వివరాలు

ఎస్టీపీల నిర్మాణాన్ని మూడు ప్యాకేజీలుగా అధికారులు రూపొందించారు. ప్యాకేజీ-1లో అల్వాల్, మల్కాజిగిరి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ ప్రాంతాల్లో రూ.1,230.21కోట్లతో 8 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా 402.50 ఎంఎల్​డీ మురుగు నీటిని శుద్ధి చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్యాకేజీ-2లో రాజేంద్రనగర్, ఎల్బీ నగర్ సర్కిల్ ప్రాంతాల్లో రూ.1,355.13 కోట్లతో 6 ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. 

ఇక్కడ 480.50 ఎంఎల్డీల  మురుగు నీటిని శుద్ధి చేస్తారు. ప్యాకేజీ-3లో కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో రూ.1,280.87కోట్ల వ్యయంతో 17 ఎస్టీపీలను నిర్మిస్తారు, వీటి ద్వారా రోజుకు 376.50 ఎంఎల్ డీల మురుగు నీటిని శుద్ధి చేయనున్నట్టు అధికారులు తెలిపారు.