ఇందిరమ్మ స్కీమ్​కు కొత్త ఇంజినీర్లు.. 390 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్​

ఇందిరమ్మ స్కీమ్​కు కొత్త ఇంజినీర్లు.. 390 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్​

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ స్కీమ్ కు ప్రభుత్వం కొత్త ఇంజినీర్లను నియమించనుంది. ఇందులో భాగంగా 390 మంది అసిస్టెంట్  ఎగ్జిక్యూటివ్  ఇంజినీర్ల (ఏఈ) నియామకానికి శుక్రవారం నోటిఫికేషన్  రిలీజ్  చేసింది. మ్యాన్ కైండ్  ఎంటర్ ప్రైజెస్  అనే ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్  పద్ధతిలో ఏఈలను ఏడాది కాలానికి  హౌసింగ్  కార్పొరేషన్  నియమించుకోనుంది. వీరికి నెలకు రూ.33,800 వేతనం చెల్లించనుంది. ఈ నెల 4  నుంచి 11 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దేశంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్  పూర్తి చేసి, 44 ఏళ్ల లోపు వాళ్లు మాత్రమే ఈ పోస్టులకు అర్హులని  ప్రభుత్వం తెలిపింది.

ఈ కోర్సులో వచ్చిన మార్కులు, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తామని వెల్లడించింది. 33 జిల్లాల్లో  మండలానికి ఒకరిని నియమిస్తామని తెలిపింది. కాగా రాష్ర్టంలో ప్రస్తుతం హౌసింగ్  కార్పొరేషన్ లో 120 మంది ఏఈలు  మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది ఈ ఏడాది రిటైర్  అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త ఇంజినీర్లను  నియమించుకోనుంది. ఈ సందర్భంగా హౌసింగ్  ఉద్యోగుల సంఘం స్టేట్  జనరల్  సెక్రటరీ వెంకటరామి రెడ్డి ఓ ప్రకటనలో   హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు.