నెట్వర్క్, ఆదిలాబాద్, వెలుగు: ఛత్రపతి శివాజీ మహారాజ్ 392వ జయంతి వేడుకలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా శివాజీ విగ్రహంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యామ్ నాయక్, జడ్పీటీసీ నాగేశ్వరరావు, సంఘం నాయకులు కలిసి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో మరాఠా, హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ శోభాయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, జడ్పీ మాజీ చైర్పర్సన్ సుహాసినీరెడ్డితో పాటు నాయకులు శివాజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. యువతుల డోలు వాయిద్యాలు అలరించాయి. కుంటాల మండల కేంద్రంతోపాటు కల్లూర్, ఓల, మేధన్పూర్, లింబా బీ, పెంచికల్పాడ్ గ్రామాల్లో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దహెగాంలో నిర్వహించిన శోభాయాత్ర ఆకట్టుకుంది. కాగజ్ నగర్, కుభీర్, నేరడిగొండ, జైనూర్, బజార్ హత్నూర్ తదితర మండలాల్లోనూ శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు.