- గతంలో 82 సర్వే నెంబర్లు మిస్
- ఆయా సర్వే నెంబర్ల 25 హెక్టార్ల ల్యాండ్ కు నోటిఫికేషన్
- 27 నుంచి అవార్డు మీటింగ్ లు
యాదాద్రి, వెలుగు : రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలోని భువనగిరిలోని చివరి పార్ట్ ల్యాండ్ త్రీజీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ల్యాండ్‌కు సంబంధించిన రైతులతో భువనగిరి ఆర్డీవో ఆఫీసులో ఈ నెల 27 నుంచి అవార్డ్ మీటింగ్ నిర్వహించనున్నారు. అయితే భూ సేకరణను వ్యతిరేకిస్తున్న ఇక్కడి రైతులు గతంలో నిర్వహించిన అవార్డు మీటింగ్‌లకు హాజరుకాలేదు. భారత్‌మాల పరియోజన ఫేస్-1లో భాగంగా రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం యాదాద్రి జిల్లా మీదుగా 59.33 కిలోమీటర్లు నిర్మాణం కానుంది.
జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లో 1927 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఈ భూ సేకరణ కోసం గతంలోనే త్రీ ఏ, త్రీ డీ నోటిఫికేషన్లతో పాటు త్రీ జీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ చేసిన త్రీజీ నోటిఫికేషన్లో 82 సర్వే నెంబర్లకు చెందిన ల్యాండ్ పేర్కొనలేదు. కాగా బుధవారం గౌస్‌నగర్, కేసారం, ఎర్రంబెల్లి, తుక్కాపూర్, పెంచికల్ పహాడ్, రాయగిరిలోని 82 సర్వే నెంబర్లకు సంబంధించిన 25 హెక్టార్ల ల్యాండ్ వివరాలు, రైతుల పేర్లతో కూడిన త్రీ జీ నోటిఫికేషన్‌ను నేషనల్ హైవే రిలీజ్ చేసింది.
27 నుంచి మీటింగ్‌లు.. డాక్యూమెంట్ సేకరణ
త్రీజీ రిలీజ్ చేయడంతో ఆయా సర్వే నెంబర్లలోని రైతులు, ఖాళీ ప్లాట్ల ఓనర్లతో ఈ నెల 27 నుంచి 30 వరకూ భువనగిరి ఆర్డీవో ఆఫీసులో అవార్డు మీటింగ్‌లు నిర్వహించాల్సి ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్ లేదా ఖాళీ ప్లాట్ కోల్పోయే వాటి విస్తీర్ణం వివరాలను ఆఫీసర్లకు అందించాలి. అదే విధంగా వాటిలోని ఇండ్లు, బాయి, బోరు, చెట్లు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన వివరాలను కూడా అందించాల్సి ఉంటుంది.
అనంతరం వాటికి సంబంధించిన డాక్యూమెంట్లు, యజమాని ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ అందించాల్సి ఉంటుంది. ఈ నెల 27న గౌస్‌నగర్, కేసారం, 28న ఎర్రంబెల్లి, తుక్కాపూర్, 30న పెంచికల్ పహాడ్, రాయగిరి రైతులతో మీటింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే భూ సేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న బాధితులు అక్టోబర్‌లో నిర్వహించిన అవార్డు మీటింగ్‌లకు హాజరుకాలేదు. తమ భూములకు సంబంధించిన డ్యాక్యూమెంట్స్ కూడా అందించని సంగతి తెలిసిందే.