
న్యూఢిల్లీ: ఇండియా నుంచి గూడ్స్ ఎగుమతులు కిందటి నెలలో 36.43 బిలియన్ డాలర్లకు తగ్గాయి. కిందటేడాది జనవరిలో నమోదైన 37.32 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2.38 శాతం పడిపోయాయి. దిగుమతులు మాత్రం ఏకంగా 10 శాతం పెరిగి 53.88 బిలియన్ డాలర్ల నుంచి 59.42 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. ప్రభుత్వ డేటా ప్రకారం, ట్రేడ్ డెఫిసిట్ (దిగుమతులు మైనస్ ఎగుమతులు) ఈ ఏడాది జనవరిలో 22.99 డాలర్లుగా రికార్డయ్యింది.
కిందటేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య ఇండియా 358.91 బిలియన్ డాలర్ల విలువైన గూడ్స్‌ను ఎగుమతి చేయగా, 601.9 బిలియన్ డాలర్ల విలువైన గూడ్స్‌ను దిగుమతి చేసుకుంది. ట్రేడ్ డెఫిసిట్ సుమారు 257 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏడాది ప్రాతిపదికన ఇండియా దిగుమతులు 7 శాతం పెరగగా, ఎగుమతులు మాత్రం కేవలం 1.39 శాతమే వృద్ధి చెందాయి.
యూఎస్‌కు పెరిగిన ఎగుమతులు..
ఇండియా నుంచి యూఎస్‌కు జరుగుతున్న ఎగుమతులు మాత్రం కిందటి నెలలో ఏడాది లెక్కన 39 శాతం వృద్ధి చెంది 8.44 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదే టైమ్‌లో దిగుమతులు కూడా 33.46 శాతం పెరిగి 3.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్–జనవరిలో యూఎస్‌కు 68.46 బిలియన్ డాలర్ల విలువైన గూడ్స్‌ను ఎగుమతి చేశాం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇదే టైమ్‌లో జరిపిన 62.84 బిలియన్ డాలర్లతో పోలిస్తే 8.95 శాతం గ్రోత్ నమోదయ్యింది. 2021 నుంచి 2024 మధ్య ఇండియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా యూఎస్ కొనసాగుతోంది. అమెరికాతో వాణిజ్య మిగులును కూడా ఇండియా సాధిస్తోంది. 2023–24 లో అమెరికా–ఇండియా మధ్య 119 బిలియన్ డాలర్ల (77.51 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 42.19 బిలియన్ డాలర్ల దిగుమతులు) వ్యాపారం జరిగింది. ఇంకో ఐదేళ్లలో వ్యాపారాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని ఇరు దేశాలు టార్గెట్ పెట్టుకున్నాయి.
యూఎస్ ప్రొడక్ట్‌లపై మరింతగా తగ్గనున్న టారిఫ్‌లు..
యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియాతో సహా వివిధ దేశాలపై పరస్పర టారిఫ్‌లు (ఎంతేస్తే అంతే వేయడం) వేస్తామని హెచ్చరించడంతో భారత ప్రభుత్వం దిగొస్తోంది. యూఎస్ ప్రొడక్ట్‌ల దిగుమతులపై సుంకాలను తగ్గించాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే టెక్స్‌టైల్స్ నుంచి మోటార్‌సైకిల్స్ వరకు వివిధ ప్రొడక్ట్‌లపై దిగుమతి సుంకాలను కేంద్రం తగ్గించింది. మరిన్ని ప్రొడక్ట్‌లపై సుంకాలు తగ్గిస్తామని, టారిఫ్‌ల పరంగా సంస్కరణలు తీసుకొస్తామని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇన్వెస్టర్లు వ్యాపారాన్ని సులభంగా జరుపుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే సుంకాలు తగ్గింపు, ట్యాక్స్‌ల రేషనలైజేషన్ వంటివి జరుగుతుంటాయని అన్నారు.
యూఎస్‌తో వ్యాపారం చేయడం ద్వారా ఇండియాకు సుమారు 41 బిలియన్ డాలర్ల ట్రేడ్ మిగులు వస్తోంది. ఇంకా యూఎస్ ప్రొడక్ట్‌లపై ఎక్కువ టారిఫ్ రేటును వేస్తున్నాం. ట్రంప్ ప్రభుత్వం పరస్పర టారిఫ్‌లు వేస్తే ఇండియా ఎక్కువగా నష్టపోతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా ప్రొడక్ట్‌లపై సగటున 10 శాతం టారిఫ్ రేటు వేస్తుండగా, మన ప్రొడక్ట్‌లపై అమెరికా సగటున 3 శాతం వేస్తోంది. పరస్పర టారిఫ్‌లు వేస్తే ఈ 3 శాతం కాస్తా 15 శాతం వరకు కూడా పెరగొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇండియా యూఎస్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ముఖ్యమైన 30 ప్రొడక్ట్‌లపై టారిఫ్ రేటు 3 శాతంలోపే ఉందని, ఎక్కువ టారిఫ్‌లు కేవలం కొన్ని ప్రొడక్ట్‌లపైనే వేస్తున్నామని ఫైనాన్స్ సెక్రెటరీ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు.