- రూ.14 కోట్లకు అమ్ముడైన 4బీహెచ్‌కే లగ్జరీ అపార్ట్‌మెంట్
ముంబై : ముంబైలో ఇండ్ల రేట్లు భారీగా పెరిగిపోయాయి. తాజాగా సబర్బ్ ఏరియా బోరివలి వెస్ట్‌లో 4 బీహెచ్‌కే లగ్జరీ ఫ్లాట్ ఏకంగా రూ.14 కోట్లకు అమ్ముడైంది. దీని విస్తీర్ణం 2,497 చదరపు అడుగులు కాగా, ఒక్కో చదరపు అడుగును రూ.56 వేలకు బయ్యర్ కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ఆధారంగా ఇండెక్స్‌ట్యాప్ డాట్ కామ్ ఈ వివరాలను బయట పెట్టింది. అంధేరి, దాదర్, మహిమ్ ఆఫ్ ముంబై, వైల్ పార్లే వంటి ఏరియాల్లో మాదిరే బోరివలిలో రేట్లు ఉన్నాయని రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్‌లు పేర్కొన్నారు.
తాజా డీల్ బోరివలి రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసిందని అన్నారు. కాగా, అక్వారియా గ్రాండే రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో ఈ 4బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ ఉంది. దీన్ని వాధ్వా గ్రూప్ నిర్మించింది. ముంబై బిజినెస్‌మ్యాన్ హేమంత్ పాటిల్ దీనిని కొనుగోలు చేశారు. ఇది 27 వ ఫ్లోర్‌లో ఉంది. ఈ అపార్ట్‌మెంట్ రిజిస్ట్రేషన్ ఈ ఏడాది జూన్ 21 న పూర్తయ్యిందని, స్టాంప్ డ్యూటీ ఖర్చే రూ.84 లక్షలు అయ్యిందని ఇండెక్స్‌ట్యాప్ పేర్కొంది.
బోరివలి ఏరియాలో చదరపు అడుగు ధర రూ.25 వేల నుంచి రూ.40 వేల మధ్యలో ఉంది. యావరేజ్‌గా చదరపు అడుగు రేటు రూ.30 వేలు పలుకుతోంది. ఇక్కడ ఓబ్రాయ్ స్కై సిటీలోని అపార్ట్‌మెంట్‌లు గరిష్టంగా చదరపు అడుగుకి రూ.48,800 కు అమ్ముడయ్యాయి.