పోలీసులే దొంగలైతే!.. చెకింగ్ పేరుతో లూటీ

లక్నో: దొంగల బారి నుంచి రక్షించాల్సిన పోలీసులే చోరీ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. చెకింగ్ చేయాలనే సాకుతో ఓ నగల వ్యాపారిని నలుగురు పోలీసులు దోచుకున్న ఘటన సంచలనం రేపుతోంది. ఉత్తర్ ప్రదేశ్‌‌లోని గోరఖ్‌పూర్‌‌లో ఈ చోరీ జరిగింది. ఒక జ్యువెలరీ షాప్ యజమాని తన అసిస్టెంట్‌‌తో కలసి బుధవారం గోరఖ్‌‌పూర్ నుంచి లక్నోకు వెళ్తున్నాడు. ఆ టైమ్‌‌లో గోరఖ్‌‌పూర్ హైవేపై యూనిఫామ్‌‌లో ఓ ఎస్సై, ముగ్గురు కానిస్టేబుల్స్ ఆ బస్సును ఆపారు. చెకింగ్ చేయాలని చెప్పి జ్యువెలరీ షాప్ యజమానితోపాటు అతడి అసిస్టెంట్‌‌ను కిందకు దించారు. ఇద్దరినీ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి వారి దగ్గర ఉన్న నగలు, డబ్బును దోచుకున్నారు. దీనిపై పోలీసులకు సదరు బాధితుడు ఫిర్యాదు చేశాడు.

విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు లూటీకి పాల్పడింది సబ్‌‌ఇన్‌స్పెక్టర్ ధర్మేంద్ర యాదవ్‌, మరో ముగ్గురు కానిస్టేబుల్స్‌ అని గుర్తించారు. వీరు బస్తీ స్టేషన్‌‌లో విధులు నిర్వర్తిస్తున్నారని తెలుసుకున్నారు. దీంతో ధర్మేంద్రతోపాటు ముగ్గురు కానిస్టేబుల్స్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరికి సహకరించిన ఇద్దరు ఇన్‌‌ఫార్మర్స్‌‌ను కూడా పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.19 లక్షల నగదు, రూ.16 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతోపాటు దొంగతనం కోసం వాడిన కారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నలుగురు పోలీసులకు గత నెలలో జరిగిన ఇలాంటి పలు క్రైమ్ కేసుల్లోనూ హస్తం ఉందని విచారణలో తేలింది. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద వీరిపై చర్యలు తీసుకుంటామని గోరఖ్‌పూర్ చీఫ్ జోగేంద్ర కుమార్ పేర్కొన్నారు.