- 420 కేసు నమోదు చేసి రెండు నెలలు
- చార్జీషీటు దాఖలు చేయని వైనం
యాదాద్రి, వెలుగు : సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అప్పగించని మిల్లు నుంచి రికవరీ చేయడంలో సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ మీన మేషాలు లెక్కిస్తోంది. యాదాద్రి జిల్లాలో 2022-–23 వానాకాలం సీజన్లో 44 సీఎంఆర్ మిల్లులకు 2,85,217 టన్నుల వడ్లను సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ అందించింది. సీఎంఆర్ కింద ఈ మిల్లులు 1,91,250 టన్నుల బియ్యం అందించాల్సి ఉంది. వీటిలో 43 మిల్లుల నుంచి 1,90,333 (99 శాతం)టన్నుల సీఎంఆర్ సేకరణ జరిగింది. కానీ 1975 టన్నుల వడ్లు తీసుకున్న జిల్లాలోని గుండాల మండలం అనంతారంలోని బిన్నీ రైస్ మిల్ 1323 టన్నుల బియ్యం అందించాల్సి ఉంది.
అయితే కేవలం 173 టన్నుల బియ్యం మాత్రమే అప్పగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎంఆర్ బకాయి విషయంలో స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సీఎంఆర్ బకాయి ఉన్న మిల్లు యాజమాన్యంపై జిల్లా సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ ఒత్తిడి చేసింది. అయితే మిల్లు యజమాని లక్ష్మీ నారాయణ రెడ్డి గతేడాది మృతి చెందడంతో అతడి బంధువులు లీల, ఎల్లారెడ్డి ఈ మిల్లును టేకోవర్ చేసుకున్నారు. టేకోవర్ చేసుకున్న వీరు సీఎంఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వడ్లను మరాడించినా..
బియ్యం మాత్రం కేవలం 173 టన్నులు మాత్రమే అందించారు. బకాయి ఉన్న 1150 టన్నుల సీఎంఆర్‌పై ఆఫీసర్లు ఒత్తిడి చేసినా తమకు సంబంధం లేదని అప్పటి మిల్లు యజమానితో మాట్లాడుకోండని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. బకాయిగా ఉన్న 1150 టన్నులకు సంబంధించిన విలువ రూ.4,18,99,000 కోట్లకు 25 శాతం ఫెనాల్టీగా రూ.1.04,74,750 విధించారు. దీంతో బకాయి మొత్తం రూ. 5,23,73,750కు చేరింది. అయినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మిల్లును తనిఖీ చేయగా అందులో వడ్లు లేవు.
రెండు నెలలైనా చర్యలు లేవు
జనవరి 25న గుండాల పీఎస్‌లో ఫిర్యాదు చేయగా మృతి చెందిన మిల్లు యజమాని లక్ష్మి నారాయణ రెడ్డి సోదరుడైన నరేందర్ రెడ్డి, మిల్లును టేకోవర్ చేసిన లీల, ఎల్లారెడ్డిపై 420 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మిల్లులో సివిల్ సప్లయ్ డీఎం గోపికృష్ణ, డీఎస్వో శ్రీనివాసరెడ్డి పంచనామా కూడా నిర్వహించారు. ఇదంతా జరిగి రెండు నెలలు కావస్తున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లను ఆరా తీయగా పోలీసులు ఛార్జీషీటు దాఖలు చేయలేదని చెబుతున్నారు.
ఛార్జీషీటు దాఖలు చేస్తేనే తాము ముందు కెళ్లి మిల్లుపై రెవెన్యూ రికవరీ (ఆర్ ఆర్)చట్టం ప్రయోగిస్తామని అంటున్నారు. ఈ యాక్ట్ ప్రయోగిస్తేనే మిల్లు గత యజమాని, ప్రస్తుతం టేకోవర్ చేసిన వారి ఆస్తుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఆస్తులను ఇతరులకు విక్రయించకుండా వాటిని బ్లాక్‌లో పెట్టగలమని తెలిపారు. ఆ ఆస్తులను వేలం వేసి సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ ఇవ్వాల్సిన రూ. 5.23 కోట్లు రాబట్టుకుంటామని చెబుతున్నారు. ఆస్తులు వేలం వేసిన రావాల్సిన బకాయి తమకు మొత్తం సమకూరని పక్షంలో గ్యారంటీగా ఉన్న మిల్లర్ అసోసియేషన్ నుంచి రాబట్టుకుంటామని ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు.
యాసంగి, వానాకాలం బకాయిలు
యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించి అప్పగించాల్సిన సీఎంఆర్ ఇంకా కొన్ని మిల్లుల్లోనే ఉంది. 2022-–23 యాసంగి సీజన్లో 4,11,181 టన్నుల వడ్లను జిల్లాలోని 41 సీఎంఆర్ మిల్లులకు అప్పగించారు. ఇందుకు సీఎంఆర్ కింద బాయిల్డ్ రైస్ 1,41,855 టన్నులు, రా రైస్ గా 1,34,874 టన్నులు కలిపి మొత్తంగా 2,76,729 టన్నులు అప్పగించాల్సి ఉంది. ఇప్పటివరకూ 1,54,321 టన్నులు (60 శాతం) మాత్రమే అప్పగించారు. ఇంకా 40 శాతం బియ్యం అంటే
1,22,408 టన్నులు అప్పగించాల్సి ఉంది. 2023–-24 వానాకాలం సీజన్‌కు సంబంధించి 2,65,197 టన్నుల వడ్లను 47 మిల్లులకు అప్పగించారు. ఇందుకుగాను సీఎంఆర్ కింద 1,77,682 టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. ఇప్పటివరకూ 5510 టన్నులు మాత్రమే అప్పగించగా ఇంకా 1,72,172 టన్నులు బియ్యం ఇంకా ఇవ్వాల్సి ఉంది.