ముంబై: డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా ఓ వృద్దురాలి( 77)ని వాట్సాప్ కాల్ ద్వారా దాదాపు నెల రోజులపాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి రూ. 3.8 కోట్లు కొట్టేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సౌత్ ముంబైలో చోటుచేసుకుంది. వృద్ధురాలు తన భర్తతో కలిసి సౌత్ ముంబైలోని మాయానగర్‌లో నివసిస్తున్నారు. ఓ రోజు వారికి గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి ఐపీఎస్ అధికారినని తనను తాను పరిచయం చేసుకున్నాడు.
మీరు తైవాన్‌కు పంపిన పార్సిల్ నిలిచిపోయిందని వృద్ధురాలికి చెప్పాడు. ఆ పార్సిల్ నుంచి ఐదు పాస్‌పోర్టులు, బ్యాంకు కార్డు, 4 కిలోల బట్టలు, ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించాడు. తాను ఎవరికీ ఎలాంటి పార్సిల్ పంపలేదని వృద్ధురాలు బదులిచ్చింది. దాంతో ఆమె ఆధార్ కార్డ్ వివరాలను చెప్పాడు. మనీలాండరింగ్ కేసు నమోదైందని.. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించాడు. పోలీస్ డ్రెస్‌లో ఉన్న వ్యక్తితో మాట్లాడించాడు.
స్కైప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించాడు. వాట్సాప్ కాల్ డిస్‌కనెక్ట్ చేయొద్దని, కేసు గురించి ఎవరికీ చెప్పవద్దన్నాడు. విచారణలో భాగంగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయాలని, నిర్దోషి అని తేలగానే తిరిగిచ్చేస్తామని నమ్మబలికారు. అలా నెల రోజులపాటు వృద్ధురాలి నుంచి దాదాపు రూ. 3.8 కోట్లు కొట్టేశారు. డబ్బు తిరిగి రాకపోవడంతో ఆమె జరిగిన విషయాల్ని తన కూతురితో చెప్పింది. దీంతో వృద్ధురాలితో కలిసి కూతురు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు.