నీళ్ల గొడవ..రెండు గ్రూపుల మధ్య కాల్పులు..నలుగురు మృతి

నీళ్ల గొడవ..రెండు గ్రూపుల మధ్య   కాల్పులు..నలుగురు మృతి

పంజాబ్ లోని బటాలాలోని శ్రీ హరగోవింద్‌పూర్ దగ్గర  దారుణం జరిగింది. నీటి పంపిణీ విషయంలో  రెండు గ్రూపుల మధ్య జరిగిన దాడుల్లో నలుగురు మరణించగా..మరో 8 మందికి  గాయాలయ్యాయి. 

 పోలీసుల వివరాల ప్రకారం  ప్రభుత్వ నీటి పంపిణీ విషయంలో జూలై 7న సాయంత్రం  అంగ్రేజ్ సింగ్.. టార్సెమ్ సింగ్ అనే రెండు  గ్రూపు సభ్యుల మధ్య వివాదం తలెత్తింది. రెండు వర్గాలు, ఆయుధాలు, కాల్పులతో  దాడులు చేసుకున్నారు.  ఈ కాల్పుల్లో నలుగురు చనిపోగా మరో 8 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలం దగ్గరలో పోలీసు పెట్రోలింగ్ బృందం ఉందని..సమాచారం అందుకున్న  రెండు నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నారని  బటాలా సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పి) అశ్విని గోత్యాల్ తెలిపారు. 

మరణించిన వారిలో ముగ్గురు  బల్జీత్ సింగ్, షంషేర్ సింగ్, బల్రాజ్ సింగ్, విధ్వన్ గ్రామ నివాసితులు కాగా మరొకరు  ముర్ గ్రామానికి చెందిన నిర్మల్ సింగ్ అని గుర్తించారు.  ఎనిమిది మంది వ్యక్తులు గాయపడ్డారని అశ్విని తెలిపారు. శ్రీహరగోవింద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఎస్పీ తెలిపారు.