ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. నలుగురు మృతి.. శిథిలాల కింద ఎందరో..

ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. నలుగురు మృతి.. శిథిలాల కింద ఎందరో..

ఢిల్లీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. అందరూ గాఢ నిద్రలో ఉన్న వేళ.. శనివారం (ఏప్రిల్19)  తెల్లవారుజామున బిల్డింగ్ కుప్పకూలడంతో ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున రెండున్నర గంటల సమయంలో ఉన్నట్లుండి బిల్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. 

ఢిల్లీలోని ముస్తఫాబాద్ ఏరియాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ బలగాలు, ఢిల్లీ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న వెంటనే శిథిలాలను తొలగించి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బిల్డింగ్ కూలడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

శనివారం తెల్లవారు జామున 2.50 గంటలకు బిల్డింగ్ కూలినట్లు స్థానికులు సమాచారం అందించారని డివిజనల్ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర అత్వాల్ తెలిపారు. సమాచారం వచ్చిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామని అన్నారు. బిల్డింగ్ పూర్తిగా నేలమట్టం అయ్యిందని, శిథిలాల కింద ఉన్న క్షతగాత్రులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. 

ఢిల్లీలో శుక్రవారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసినట్లు స్థానికులు తెలిపారు. ఈ భారీ వానకు బిల్డింగ్ నేలమట్టం అయినట్లు చెప్పారు.