- త్వరలో ఒకటి ఫైనల్.. ఆ వెంటనే టెండర్లు, నిర్మాణ పనులు
- రాజేంద్రనగర్లో 100 ఎకరాల్లో రూ. వెయ్యి కోట్లతో నిర్మాణం
- రెండేండ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర హైకోర్టు కొత్త భవన నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ బిల్డింగ్ కోసం ఆర్కిటెక్చర్ ఏజెన్సీలు మొత్తం 9 డిజైన్లను ఆర్ అండ్ బీకి ఇవ్వగా.. వాటిని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆధ్వర్యంలోని జడ్జిల కమిటీకి అధికారులు అందజేశారు. వీటిలో నాలుగు డిజైన్లను కమిటీ ఓకే చేసినట్టు తెలిసింది. త్వరలో ఒక డిజైన్ ను హైకోర్టు చీఫ్ జస్టిస్, జడ్జీలు ఫైనల్ చేయనున్నారు. ఆ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమోదం తీసుకొని, టెండర్లు పిలిచి నిర్మాణ పనులను ఆర్అండ్ బీ అధికారులు చేపట్టనున్నారు.
100 ఎకరాల్లో రూ. వెయి కోట్లతో నిర్మాణం
హైకోర్టు నూతన భవనాన్ని వందేండ్ల పాటు పటిష్ఠంగా ఉండేలా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. గత ఏడాది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాజేంద్రనగర్ లో 100 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కొత్త హైకోర్టును సుమారు రూ. 1,000 కోట్లతో నిర్మించాలని నిర్ణయిచింది. రెండేండ్లలో నిర్మాణం పూర్తి చేయాలని టెండర్ దక్కించుకునే కంపెనీకి ప్రభుత్వం గడువు విధించనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. 2026 చివర లేదా 2027 జనవరి కల్లా కొత్త హైకోర్టును ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ ఏడాది మార్చి 27న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన చేశారు. అప్పుడు లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున సీఎం, మంత్రులు అటెండ్ కాలేదు. హైకోర్టు మెయిన్ బిల్డింగ్ తో పాటు జడ్జిలకు నివాస సముదాయాలతోపాటు మొత్తం 40 బిల్డింగులు నిర్మించాలని ఆర్ అండ్ బీ అధికారులకు జడ్జీల కమిటీ సూచించింది. ప్రస్తుతం జడ్జీల ఇండ్లు రాయదుర్గంలో ఉన్నాయి. కొత్త హైకోర్టు ప్రాంగణంలోనే ఇండ్లు నిర్మిస్తే సమయం ఆదా అవుతుందని భావిస్తున్నారు. జడ్జీల నివాస సముదాయాలు, రాష్ట్ర బార్‌కౌన్సిల్, హైకోర్టు బార్ అసోసియేషన్, ఆడిటోరియం, లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఫైలింగ్‌సెక్షన్లు, రికార్డుల గదులు, పార్కింగ్ తదితర అనేక అవసరాలకు తగిన విధంగా కొత్త హైకోర్టులో నిర్మాణాలు చేపట్టనున్నారు. వీటితో 500కు పైగా కార్ల పార్కింగ్, వెయ్యికి పైగా బైక్ ల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేయనున్నారు. అడ్వకేట్లకు రూమ్ లు కూడా ఇందులో నిర్మించనున్నారు.
ఎన్నో ఏండ్ల ప్రతిపాదన
హైకోర్టుకు కొత్త భవనాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన ఎన్నో ఏండ్లుగా కాగితాలకే పరిమితమవుతూ వచ్చిందని సీనియర్ అడ్వకేట్లు అంటున్నారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఈ అంశంపై చర్చలు జరిగాయని చెప్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి కొత్త హైకోర్టు నిర్మాణం అంశం మళ్లీ తెర మీదికి వచ్చింది. పలు సార్లు అప్పటి సీఎం కేసీఆర్ దగ్గర దీనిపై చర్చ జరిగినా అడుగు ముందుకు పడలేదు. గత ఏడాది డిసెంబర్ లో కొత్త ప్రభుత్వం వచ్చాక కార్యరూపం దాల్చింది. వెంటనే ల్యాండ్ కేటాయించటం, శంకుస్థాపన, డిజైన్లు అన్ని శర వేగంగా జరగుతున్నాయి. కొత్త హైకోర్టు నుంచి మెట్రో మార్గాన్ని ఎయిర్ పోర్ట్ వరకు తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఎల్బీ నగర్ – చాంద్రాయణ్ గుట్ట మీదుగా కొత్త హైకోర్టు నుంచి ఎయిర్ పోర్ట్ కు మెట్రో నిర్మిస్తే ట్రాఫిక్ తగ్గడంతో పాటు పబ్లిక్ కు, హైకోర్టుకు వెళ్లే వారికి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నది.