ఒడిశాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం(డిసెంబర్ 29) తెల్లవారుజామున కోరాపుట్ జిల్లా సమీపంలో దాదాపు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 40 మందికి గాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు కటక్‌లోని నియాలీ నుండి దాదాపు 50 మంది భక్తులతో గుప్తేశ్వర్ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బోయిపరిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాపరిఘాటి కొండ ప్రాంతంలో పదునైన మలుపులో బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రయాణికుల ఆర్తనాదాలు విని అటుగా వెళ్తున్న వారు అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను సమీపంలోని బోయిపరిగూడ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
ప్రమాదం జరిగిన వెంటనే మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి మోహన్ మాఝీ తన సంతాపాన్ని తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.