మెదక్, వెలుగు: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మెదక్ జిల్లా తుది ఓటరు జాబితాను గురువారం కలెక్టర్ రాజర్షి షా విడుదల చేశారు. జిల్లా పరిధిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 4 , 42, 891 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 9 మంది ఎన్ఆర్ఐ, 126 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ఓటర్లలో 2,13,460 మంది పురుషులు, 2, 29, 431 మంది మహిళలు, ఒకరు థర్డ్ జెండర్ ఉన్నారన్నారు. 9 మంది ఎన్ఆర్ఐ ఓటర్లలో 8 మంది పురుషులు, 1 మహిళ ఉందన్నారు. 126 మంది సర్వీస్ ఓటర్లలో పురుషులు 121 మంది, మహిళలు ఐదుగురు ఉన్నారని తెలిపారు.
నియోజకవర్గాల వారీగా ఓటర్లను పరిశీలిస్తే మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ 1,03, 654 పురుషులు, 1, 13, 089 మంది మహిళలు, ఐదుగురు థర్డ్ జెండర్స్, 8 మంది ఎన్ఆర్ఐ, 87 మంది సర్వీస్ ఓటర్లు కలుపుకుని మొత్తం 2, 16, 743 మంది ఓటర్లు ఉన్నారన్నారు. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 1,09,806 మంది పురుషులు, 1,16, 342 మంది మహిళలు, ఆరుగురు థర్డ్ జెండర్స్, ఒక ఎన్ఆర్ఐ, 39 మంది సర్వీస్ ఓటర్లు కలుపుకుని మొత్తం 2, 26, 148 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఎస్ఎస్ఆర్- 2024 కార్యక్రమంలో భాగంగా జనవరి 22 వరకు వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి తుది ఓటరు జాబితా రూపొందించామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ జాబితాను అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలోని బూత్ లెవెల్ అధికారుల వద్ద, తహసీల్దార్ కార్యాలయాల్లో, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.