నాలుగు మెడికల్ కాలేజీల పర్మిషన్లు పెండింగ్

  • రాష్ట్ర సర్కార్ అప్పీల్​పై స్పందించని కేంద్రం
  • మొదలైన ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ
  • జీవో 33పై తేలని పంచాయితీ
  • కోర్టులో కేసులు వేసిన 60 మంది స్టూడెంట్లు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల పర్మిషన్ల పంచాయితీ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వద్దకు చేరింది. ములుగు, నర్సంపేట్, గద్వాల, నారాయణపేట్, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, మెదక్‌, యాదాద్రిలో మెడికల్ కాలేజీల కోసం ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్నది. కాలేజీల్లో సౌలతులు, సార్లు లేరని పలు లోపాలు ఎత్తి చూపుతూ తొలుత ఒక్క కాలేజీకి కూడా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) పర్మిషన్ ఇవ్వలేదు. 

ఎన్‌ఎంసీ లేవనెత్తిన లోపాలను సరిచేసిన అధికారులు రీ అప్పీల్ చేశారు. ఈ అప్పీల్‌ను పరిశీలించిన తర్వాత ములుగు, నర్సంపేట్, నారాయణపేట్, గద్వాల కాలేజీలకు ఎన్‌ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. కుత్బుల్లాపూర్, మహేశ్వరం, మెదక్, యాదాద్రి కాలేజీల్లో ఇంకా సౌలతుల్లేవంటూ వాటికి పర్మిషన్లు ఇవ్వకుండా మళ్లీ పెండింగ్‌లో పెట్టింది. ముఖ్యంగా ఈ కాలేజీల బిల్డింగుల సమస్యను ఎన్‌ఎంసీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. బిల్డింగుల రెంటల్ అగ్రిమెంట్లు సరిగా లేవని స్పష్టం చేసింది. దీంతో మరోసారి రెంటల్ అగ్రిమెంట్లు సరిచేసిన అధికారులు, సెకండ్ అప్పీల్‌ చేశారు. అయితే, సెకండ్ అప్పీల్ అనేది ఎన్‌ఎంసీ చేతిలో ఉండదు. కేంద్ర ఆరోగ్యశాఖ ఈ అప్పీళ్లను పరిశీలించాల్సి ఉంటుంది. 

ఇంకా కేంద్రం నుంచి రాని రిప్లై

రాష్ట్ర అధికారులు కేంద్రానికి అప్పీల్ చేసి పది రోజులు అవుతున్నా, ఇప్పటివరకూ ఎలాంటి రిప్లై రాలేదు. సెకండ్ అప్పీల్‌ తర్వాత కాలేజీకి పర్మిషన్ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఎప్పుడు టైమ్ ఇస్తదో... అప్పుడే రాష్ట్ర అధికారులు ఢిల్లీకి వెళ్లి అఫిడవిట్లను సమర్పించాలి. అయితే, ఇప్పటివరకూ కేంద్రం నుంచి రెస్పాన్స్ రాలేదని, ఒకట్రెండు రోజుల్లో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు తెలిపారు. గతంలో మంచిర్యాల మెడికల్ కాలేజీకి కూడా ఇలాగే చివర్లో పర్మిషన్ ఇచ్చారని మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు గుర్తు చేస్తున్నారు.

స్థానికతపై ఇంకా సందిగ్ధత

ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల కౌన్సిలింగ్‌కు పది రోజుల కిందే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 13వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్‌కు గడువు ఉండగా, దాన్ని ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించారు. ఆ గడువు కూడా ముగిసి మూడ్రోజులు అయినా, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ మొదలు కాలేదు. ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసిన తర్వాత వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ మొదలు పెడుతామని వర్సిటీ అధికారులు చెప్తున్నారు. 

ఇదిలా ఉండగా, ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33పై సుమారు 60 మంది స్టూడెంట్లు కేసులు వేశారు. తామంతా తెలంగాణకు చెందిన వాళ్లమేనని, ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్ల తాము మెడిసిన్ చదివే అవకాశాన్ని కోల్పోతున్నామని కోర్టును ఆశ్రయించారు. ఈ స్టూడెంట్ల నుంచి దరఖాస్తులను తీసుకోవాలని కాళోజీ వర్సిటీని కోర్టు ఆదేశించింది. అయితే, తుది తీర్పును పెండింగ్‌లో పెట్టింది. ఒకవేళ కోర్టు తీర్పు ప్రభుత్వం తీసుకున్న జీవోకు వ్యతిరేకంగా వస్తే, కౌన్సిలింగ్‌కు ఇబ్బందిగా మారుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవో 33 ప్రకారం 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు వరుసగా 4 ఏండ్లు తెలంగాణలో చదివితేనే లోకల్ స్టూడెంట్లుగా గుర్తిస్తారు. గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్‌‌ సెకండ్ ఇయర్ లోపు ఏవైనా 4 ఏండ్లు తెలంగాణలో చదివితే లోకల్ స్టూడెంట్లుగా గుర్తించేవారు.

అందుబాటులో మొత్తం 8,715 సీట్లు

ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు మూడు రౌండ్లు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ ఫస్ట్ వీక్ నాటికి చివరి రౌండ్ కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాలకూ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసీసీ) సూచించింది. ఈ లోపల మిగిలిన 4 కాలేజీలకు పర్మిషన్లు వస్తే, ఆ సీట్లను కూడా భర్తీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ లోపల పర్మిషన్ రాకపోతే, వచ్చే విద్యా సంవత్సరం మరోసారి కాలేజీల పర్మిషన్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం 28 ప్రభుత్వ, 28 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం కాలేజీల్లో కలిపి 8,715 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కుత్బుల్లాపూర్, మహేశ్వరం, మెదక్, యాదాద్రి కాలేజీలకు కూడా పర్మిషన్ వస్తే, మరో 200 సీట్లు పెరుగుతాయి. ఇవిగాక ఈసారి 3 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా పర్మిషన్ల కోసం ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేశాయి. నిజామాబాద్ నుంచి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్‌, అబ్దుల్లాపూర్‌‌మెట్‌లోని నోవా ఇన్​స్టిట్యూట్, పటాన్‌చెరు నుంచి రాజరాజేశ్వరీ ఇన్​స్టిట్యూట్ ఈ లిస్టులో ఉన్నాయి. ఈ మూడు కాలేజీలకు పర్మిషన్లు వస్తే సీట్ల సంఖ్య 9 వేలు దాటనుంది.