ఎంవీఏ కూటమికి భారీ షాక్.. ఎన్డీఏలోకి 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు..?

ఎంవీఏ కూటమికి భారీ షాక్.. ఎన్డీఏలోకి 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు..?

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమికి మరో భారీ షాక్ తగలనుందా..? ఎంవీ కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికార ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నారా..? అంటే మహారాష్ట్ర పొలిటికల్ సర్కిల్స్‎లో అవుననే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఘోర ఓటమితో చతికిల పడ్డ ఎంవీఏ కూటమిని కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు వీడబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో శివసేన (షిండే) నేత, పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. 

గురువారం (జనవరి 23) మంత్రి ఉదయ్ సమంత్ మీడియాతో మాట్లాడుతూ.. శివసేన (ఠాక్రే) గ్రూపులోని నలుగురు ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్వరలోనే శివసేన (షిండే) గ్రూపులో చేరబోతున్నారని బిగ్ బాంబ్ పేల్చారు. శుక్రవారం నుంచే (జనవరి 24) ఈ చేరికల పర్వం మొదలవుతోందని తెలిపారు. ఫస్ట్ ఫేజ్‎లో 4 శివసేన (ఉద్ధవ్) ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, 5 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అనేక మంది జిల్లా అధ్యక్షులు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరనున్నారు.. ఆ తర్వాత మరికొందరు వస్తారన్నారు. 

ALSO READ | కేజ్రీవాల్ యమునా నదిలో స్నానం చేయగలరా..? CM యోగి ఛాలెంజ్

రత్నగిరి నుంచి ఈ అపరేషన్ స్టార్ట్ అవుతోందని తెలిపారు. ఇది జస్ట్ ట్రైలరేనని మంత్రి ఉదయ్ సమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంవీఏ నేతల చేరిక అంశంపై కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, 2024 చివర్లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ (శరద్) ఘోర ఓటమిని చవిచూశాయి.

ఎంవీఏ కూటమి ఓటమి నేపథ్యంలో ఆ కూటమి నేతలు అధికార కూటమి వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగానే తొలుత 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మహా వికాస్ అఘాడీ కూటమిని వీడబోతున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో ముంబైలో స్థానిక సంస్థలు జరగనున్న వేళ.. నేతల ఫిరాయింపు ఎంవీఏ కూటమికి భారీ ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.