ఆ తలుపులను తెరిచే ధైర్యం ఇంత వరకు ఎవరూ చేయలే

ఆ తలుపులను తెరిచే ధైర్యం ఇంత వరకు ఎవరూ చేయలే

ఎక్కడైనా మిస్టరీ ఉందంటే చాలు దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. కొందరికైతే తెలుసుకునేవరకు సరిగ్గా నిద్ర కూడా పట్టదు. అలాంటిది ఈ డోర్లు మూసి చాలా ఏళ్లు అవుతున్నా.. వాటిలో ఏముందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉన్నా ఎవరూ వాటిని తెరిచే ధైర్యం చేయలేకపోతున్నారు. వాటిని తెరిస్తే ఏ ఆపద ముంచుకొస్తుందో.. ఏ ప్రళయం మీద పడుతుందో అనే భయంతో వాటి జోలికి వెళ్లడం లేదు. ఆ మిస్టీరియస్‌‌ డోర్ల కథేంటి చూద్దాం.

బాన్ఫ్ స్ప్రింగ్స్ హోటల్

ఈ హోటల్ కెనడాలో ఉంది. దీన్ని ఫారిన్‌‌ టూరిజాన్ని  డెవలప్‌‌ చేయడానికి 1888 లో దిన్ని కట్టారు. ఇది బాన్ఫ్ నేషనల్ పార్క్‌‌లో ఉంది. దీని అసలు పేరు ‘ఫెయిర్మాంట్ బాన్ఫ్ స్ప్రింగ్స్’ కానీ... ఎక్కువగా స్ప్రింగ్స్ హోటల్‌‌ అని పిలుస్తుంటారు. దీన్ని ఒక పెద్ద కొండ మీద కట్టారు. ఈ హోటల్‌‌ నుంచి చూస్తే పచ్చని ప్రకృతి అందాలను చూడొచ్చు. బయటినుంచి చాలా అందంగా కనిపించే ఈ హోటల్‌‌లో ఇప్పటికీ సాల్వ్‌‌ చేయని ఒక రహస్యం ఉంది. ఈ హోటల్‌‌లో దెయ్యాలున్నాయని ఇప్పటివరకు చాలా మంది చెప్పారు. పైగా కొందరు వాటి వల్ల ఇబ్బందులు పడ్డామని కూడా చెప్పారు. అందుకే ఆ హోటల్‌‌లోని 8వ అంతస్తులో 873వ నెంబర్‌‌‌‌ రూమ్‌‌ని చాలాఏళ్ల నుంచి మూసి ఉంచుతున్నారు. ఆ రూమ్‌‌కి ఈ దెయ్యాలకు సంబంధం ఏంటంటే... దీని కథ తెలుసుకోవాల్సిందే!

1928లో ఒక జంట, ఇద్దరు పిల్లలతో ఈ హోటల్‌‌కి వచ్చారు. వాళ్ల మధ్య ఏ గొడవలు లేవు. చాలా హ్యాపీగా ఉన్నారు. రోజంతా జాలీగా తిరిగొచ్చి, హోటల్‌‌ రూంలో పడుకున్నారు. కానీ.. ఉదయం నిద్ర లేచి చూసే సరికి ఆ గదిలో ఒక్కరు కూడా ప్రాణాలతో లేరు. ఇన్వెస్టిగేషన్‌‌ చేస్తే తెలిసింది ఏంటంటే.. ఆ గదిలో దిగిన వ్యక్తే.. తన భార్యను, పిల్లలను హత్య చేసి, తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు అతను అలా ఎందుకు  చేశాడనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆ రూమ్‌‌ని మూసేశారు. తర్వాత తెరిచి క్లీన్‌‌ చేసి, టూరిస్ట్‌‌లకు ఇచ్చారు. కానీ.. ఆ రూంలో దిగిన ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య వచ్చింది. అర్ధరాత్రి టైంలో అరుపులు వినిపించేవి. ఎవరో తరిమినట్టు అనిపించేది. దాంతో ఆ కుటుంబ సభ్యులే దెయ్యాలుగా మారి ఆ రూంలో ఉన్నారని అందరూ అనుకున్నారు. ఇంతకీ ఆ రూమ్‌‌ నెంబర్‌‌‌‌ చెప్పలేదు కదా! అదే 873. అందుకే అప్పటినుంచి దాన్ని మూసేశారు. ఆ నెంబర్ కనపడకుండా ప్లాస్టర్‌‌‌‌ వేశారు. ఇప్పటికీ ఆ రూం తెరవలేదు. ఆ రూంలో ఏముంది? వాళ్లు ఎందుకు చనిపోయారు? నిజంగానే దెయ్యాలుగా మారి ఆ రూంలోకి వచ్చినవాళ్లని వేధిస్తున్నారా? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. ఇదే హోటల్‌‌లో మరో మిస్టరీ కూడా ఉంది. ఈ హోటల్‌‌లో పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ఒక పెళ్లి కూతురు మెట్ల మీద నుంచి జారి పడి చనిపోయింది. అప్పటినుంచి ఆమె చనిపోయిన హాల్లో వింత అరుపులు వినిపిస్తున్నాయని ఇక్కడ పనిచేసేవాళ్లు చెబుతున్నారు. 

తాజ్‌‌ మహల్‌‌

ప్రపంచంలోని వింతల్లో ఇదొకటనేది తెలిసింది. అయితే ప్రపంచంలోని ‘అన్‌‌ సాల్వ్‌‌డ్‌‌ మిస్టరీ’ల్లో కూడా ఇది చోటు దక్కించుకుంది. తాజ్‌‌ మహల్‌‌ను చూడ్డానికి ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్ట్‌‌లు వస్తుంటారు. తాజ్‌‌మహల్‌‌ పునాదుల్లో కొన్ని గదులు ఉన్నాయి. వాటి లోపలికి వెళ్లడానికి ఒక ద్వారం ఉంది. కానీ.. దాన్ని ఇప్పటివరకు ఒక్కసారి కూడా తెరవలేదు. ఈ డోర్ల గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో శివాలయం ఉందని కొందరు, ముంతాజ్‌‌ బేగం అసలైన సమాధి అక్కడే ఉందని  కొందరు చెప్తుంటారు. ఇంకొందరేమో అందులో నిధులు ఉన్నాయని నమ్ముతున్నారు. కానీ.. అందులో ఏముందనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. గవర్నమెంట్‌‌ కూడా దాన్ని తెరిచే ప్రయత్నం చేయలేదు. అయితే... ఎవరెన్ని కారణాలు చెప్పినా కాస్త నమ్మదగినది మాత్రం ఒకటుంది.. మూసి ఉన్న గదులు పాలరాయితో కట్టారు. తలుపుల్ని చాల ఏళ్ల నుంచి తెరవలేదు, కాబట్టి ఆ గోడలకు కార్బన్ డై ఆక్సైడ్‌‌ తగిలితే అది క్యాల్షియం కార్బొనేట్‌‌గా మారి పాలరాయి క్షీణిస్తుంది. తాజ్‌‌ మహల్‌‌ని మోస్తున్న ఆ పునాది గదుల గోడలు బలహీనపడితే.. పెద్ద ప్రమాదం జరగవచ్చు. తాజ్‌‌మహల్‌‌ కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే వాటిని మూసేశారని కొందరు చెప్తున్నారు. ఒకవేళ ఎక్కువ కార్బన్‌‌ డై ఆక్సైడ్‌‌ ఆ నేలమాళిగలోకి వెళ్తే, ముందుగా తాజ్ మహల్ చుట్టూ ఉన్న నాలుగు టవర్లు కూలిపోతాయి. అయితే కొందరు దీన్ని కొట్టిపారేస్తున్నారు. 

పద్మనాభస్వామి ఆలయం

కేరళలోని తిరువనంతపురంలో ఉంది. కొన్నేళ్ల నుంచి  వార్తల్లో బాగా వినిపించిన పేరు ఇది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో మహావిష్ణువు పాలసముద్రంలో శేష పాన్పుపై పవళిస్తున్నట్టు కొలువై ఉన్నాడు. చాలా ఏళ్ల నుంచి ట్రావెన్ కోర్ రాయల్‌‌ ఫ్యామిలీ ఈ ఆలయాన్ని కాపాడుతూ వస్తోంది. వేల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఆలయం ఉంది.  17వ శతాబ్దంలో మళ్ళి కట్టారు. ఇక్కడ స్వామివారి మూలవిరాట్టు చాలా పెద్దగా ఉంటుంది. అందుకే పూర్తి విగ్రహాన్ని ఒక ద్వారం నుంచి చూడలేం. ఈ ఆలయానికి వచ్చే నిధులు, గుడి ఆస్తులను చూసుకునే ట్రావెన్‌‌కోర్‌‌‌‌ రాయల్‌‌ ఫ్యామిలీ ఆ డబ్బును అక్రమంగా వాడుతోందని, సరైన లెక్కలు చూపించడంలేదని సుందర్‌‌‌‌రాజన్‌‌ అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. దాంతో 2015లో గుడి ఆస్తులను లెక్క కట్టాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఆలయం కింద ఆరు రహస్య గదులు ఉన్నాయి. వాటికి ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్‌‌ అని పేర్లు పెట్టారు. ఇవి చాలాఏళ్ల నుంచి మూసి ఉన్నాయి. వాటిలో కూడా సంపద ఉన్నదని భావించి, ఆ గదుల డోర్లను కూడా తెరవాలని ఆర్డర్‌‌‌‌ ఇచ్చింది. దాంతో ఒక కమిటీ వేసి ఆ గదులు తెరవడం మొదలుపెట్టారు. ఐదు గదుల డోర్లు తెరవగలిగారు. కానీ.. ఒక్క గది డోర్‌‌‌‌ మాత్రం తెరవలేకపోయారు. మొదటి ఐదు గదుల్లో దాదాపు 340 బంగారు జగ్గులు, 30 వెండి దీపాలు, శివుడి విగ్రహాలు, ఆభరణాలు ఉన్నాయి. వాటి విలువ దాదాపు లక్ష కోట్లుగా నిర్ధారించారు. ఈ ఆస్తుల వల్ల ఇది దేశంలోనే అతి ధనవంతమైన ఆలయంగా రికార్డుకెక్కింది. 

​ఆరో గదికి నాగబంధనం

ఐదు గదులు తెరిచినా.. ఆరో గదిని మాత్రం ఇంకా తెరవలేదు. దానికి నాగబంధనం వేసి ఉండటంతో తెరవడం సాధ్యం కాదని పండితులు తేల్చిచెప్పారు. ఈ ఐదు గదుల్లో దొరికినదానికంటే ఆరో గదిలో రెట్టింపు ధనం ఉండొచ్చని అక్కడివాళ్లు చెప్తున్నారు. అందుకే అంత పకడ్బందీగా నాగబంధనం వేశారని చెప్తున్నారు. ఈ గదికి రెండు పెద్ద నాగుపాములు కాపలా ఉంటాయని చెప్తుంటారు. మరి కొందరేమో ఆ తలుపు తెరిస్తే  సముద్రం ఉప్పొంగుతుందని నమ్ముతున్నారు. ప్రజల నమ్మకాలను దృష్టిలో ఉంచుకుని ఆ గదిని తెరవకూడదని కోర్టు తీర్పునిచ్చింది. అందులో ఏముందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.

గిజా సింహిక

ఇది ఒక కొండరాతితో చెక్కిన విగ్రహం ఇది. ఈజిప్ట్‌‌లోని అల్ గిజాలోని ఎడారిలో ఉంది. ఈజిప్ట్‌‌ పురావస్తు ప్రదేశాలతోపాటు మిస్టీరియస్‌‌ ప్లేసులకు కేరాఫ్‌‌. అలాంటి ప్లేసుల్లో ఒకటి ఈ సింహిక. మహిళ ముఖము, సింహం శరీరంతో చెక్కబడిన విగ్రహాన్ని సింహిక అంటారు. గిజాలో ఉన్న సింహికకు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. దీన్ని దాదాపు ఏడు వేల నుంచి పదివేల సంవత్సరాల క్రితం చెక్కారని కొందరు, 4,500 సంవత్సరాలు చెక్కారని మరి కొందరు వాదిస్తున్నారు. దీంతోపాటు ఈ ఎడారిలో కట్టిన కట్టడాలు, చెక్కిన విగ్రహాలు దాదాపు పూర్తిగా శిథిలమైపోయాయి. కానీ.. ఇది చెక్కు చెదరకుండా ఉంది. చాలా ఏళ్ల పాటు ఇసుకతో కప్పబడి ఉంది. అందువల్ల సేఫ్‌‌గా ఉంది.17వ శతాబ్దంలో ఈ విగ్రహం కాళ్ల కింద రెండు గదులు ఉన్నట్టు తెలుసుకున్నారు. కానీ.. వాటిని ఓపెన్‌‌ చేయడానికి ఎలాంటి పరికరాలు లేవు. అయినా ఎలాగోలా ఓపెన్‌‌ చేద్దామంటే అక్కడి గవర్నమెంట్‌‌ పర్మిషన్‌‌ ఇవ్వలేదు. ఇప్పటికీ ఆ గదులు అలానే ఉన్నాయి. ఆ గదుల మీద రీసెర్చ్‌‌ చేయడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్‌‌ ఇవ్వడంలేదు. అయితే... అందులో గ్రహాంతర వాసులు ఉన్నారని, అతీంద్రియ శక్తులు ఉన్నాయని చాలామంది నమ్ముతున్నారు. ఇప్పటికే గిజా పిరమిడ్‌‌ని తెరవాలనుకున్న వాళ్లు శపించబడ్డారని ప్రచారంలో ఉంది. అందుకే దీన్ని తెరవకపోవడమే మంచిదంటున్నారు ఇక్కడివాళ్లు. 

::: కరుణాకర్​ మానెగాళ్ల