- కొనుగోలు చేసిన నలుగురు అరెస్ట్
- నిందితుల్లో ఒకరు బీఆర్ఎస్ కౌన్సిలర్ కొడుకు
- అతడిపై ఇప్పటికే గంజాయ్ సప్లై, కిడ్నాప్ కేసులు
ఎల్బీనగర్: వాట్సాప్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న నలుగురిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు బీఆర్ఎస్ కౌన్సిలర్ కొడుకు కావడం గమనార్హం. నిందితులు డ్రగ్స్ తీసుకోవడంతోపాటు అమ్ముతున్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ జిల్లెల్ గూడకు చెందిన తెనుగు అజయ్, కర్మన్ ఘాట్‌కు చెందిన గడికాన మహేందర్ కుమార్, సూర్యాపేట విద్యానగర్‌కు చెందిన గండూరి జెఫన్యరాజ్ అలియాస్ రికీ, సూర్యాపేట జిల్లా టేకుమాట్లకు చెందిన దాసరి విల్సన్ స్నేహితులు.
వీరంతా గంజాయి, డ్రగ్స్‌కు బానిసలై బెంగుళూర్ నుంచి సరుకు తెప్పించుకుంటున్నారు. తొలుత వీరు వాట్సాప్ ద్వారా బెంగళూరులోని డ్రగ్ పెడ్లర్లను కాంటాక్ట్ అవుతున్నారు. ఆ తర్వాత క్వాంటిటీ చెప్పి ఆన్లైన్లో నగదు బదిలీ చేస్తున్నారు. దీంతో పెడ్లర్లు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకొని సిటీలో ఎదో ఒక చోట డ్రగ్స్ పెట్టి, వీరికి ఫొటోలతోపాటు లోకేషన్ పిన్ చేస్తున్నారు. దీంతో వారు ఆ డ్రగ్స్ సేకరించడంతోపాటు పలువురికి అమ్ముతున్నట్లు సమాచారం. డ్రగ్స్‌తో ఉన్న కొంత మంది ఎల్బీనగర్ కామినేని చౌరస్తా సమీపంలోని మారుతి రెసిడెన్సీ హోటల్లో ఉన్నట్లు సమాచారం రావడంతో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో సూర్యాపేట మున్సిపాలిటీ 46వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ కొడుకు జెఫన్య రాజ్ఉన్నాడు. అతనిపై సూర్యాపేటతో పాటు ఇతర ప్రాంతాల్లో పలు గంజాయి సప్లై కేసులు నమోదయ్యాయి. ఓ కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న అతడిని బీఆర్ఎస్ హయాంలో రాజకీయ పలుకుబడితో తప్పించారన్న ఆరోపణలూ ఉన్నాయి.