- రాజన్న దర్శనానికి వెళ్తుండగా యాక్సిడెంట్.. కారును ఢీకొన్న లారీ..నలుగురు మృతి
- మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
- అందరూ అన్నదమ్ముల కుటుంబాలకు చెందినవారే..
- ఎల్కతుర్తి మండలం పెంచికలపేట శివారులో ప్రమాదం
- మృతులది ములుగు జిల్లా ఏటూరునాగారం
ఎల్కతుర్తి/ఏటూరునాగారం, వెలుగు : ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలు కారులో వేములవాడ రాజన్న దర్శనం కోసం వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో నలుగురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రం గా గాయపడ్డారు. మృతుల బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. ఏటూరునాగారానికి చెందిన మంతెన కాంతయ్య(72), మంతెన శంకర్(60) అన్నదమ్ములు. కాంతయ్య కమ్మరి పని చేస్తుండగా.. శంకర్వడ్రంగి పనితోపాటు రియల్ఎస్టేట్బిజినెస్ చేసేవాడు.
మేడారం జాతర వస్తుండడంతో ముందుగా వేములవాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకునేందుకు కారులో కాంతయ్య, ఇతడి భార్య రేణుక (60), కూతురు చందన(16), శంకర్, ఇతడి భార్య శ్రీదేవి(50), వీరి కొడుకులు భార్గవ్(30), భరత్(29) గురువారం రాత్రి బయలుదేరారు. 1.30 గంటలకు వరంగల్–కరీంనగర్హైవే పై హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట వద్ద సున్నం బస్తాల లోడ్‌తో గుజరాత్ నుంచి ఏలూరు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన చోట రిపేర్ వల్ల రోడ్డు ఇరుకుగా ఉండడం.. మలుపు ఉండడంతో కంట్రోల్కాక కారునుగుద్ది లారీ అదుపు తప్పి పక్కనున్న మట్టిలో కూరుకుపోయింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. ఘటనలో కాంతయ్య, ఈయన కూతురు చందన, శంకర్, ఇతడి చిన్న కొడుకు భరత్అక్కడికక్కడే చనిపోయారు. కాంతయ్య భార్య రేణుక, శంకర్భార్య శ్రీదేవి, ఈయన పెద్ద కొడుకు భార్గవ్ తీవ్రంగా గాయపడ్డారు.
సమీపంలోని వివాన్ ఇండస్ట్రీ కార్మికులు పోలీసులకు సమాచారమివ్వడంతో డీసీపీ ఎంఏ బారి, ఎల్కతుర్తి సీఐ ప్రవీణ్, ఎస్సై రాజ్‌కుమార్ జేసీబీ సాయంతో నలుగురి డెడ్ బాడీలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని అతి కష్టం మీద బయటకు లాగారు. శ్రీదేవి, భార్గవ్ ను వరంగల్ లోని ఓ ప్రైవేట్దవాఖానలో, రేణుకకు ఎంజీఎంలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. భార్గవ్ పరిస్థితి విషమంగా ఉంది. కాంతయ్య, -రేణుకలకు 44 ఏండ్ల కింద పెండ్లి కాగా, 28 ఏండ్ల తర్వాత చందన పుట్టింది. నలుగురి మృతదేహాలను ఏటూరునాగారం తీసుకొచ్చిన బంధువులు ఒకే దగ్గర అంత్యక్రియలు నిర్వహించారు. రెండు కుటుంబాలకు చెందిన అందరూ ప్రమాదానికి గురికావడంతో మృతులకు తలకొరివి పెట్టేందుకు కూడా ఎవరూ లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీటి పర్యంతమయ్యారు.
వారం కిందటే పెద్దపల్లికి బదిలీ
శంకర్పెద్ద కొడుకు భార్గవ్ వాజేడు తహసీల్దార్ ఆఫీస్‌లో ధరణి పోర్టల్ ఆపరేటర్‌కాగా, చిన్న కొడుకు భరత్ టీఎస్ఎండీసీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఏటూరునాగారంలో సాండ్ రీచ్ అసిస్టెంట్(ఎస్ఆర్ఏ) గా పని చేస్తున్నాడు. వారం రోజుల కిందటే భరత్‌కు పెద్దపల్లి జిల్లాకు బదిలీ కావడంతో ఐదు రోజుల కింద అక్కడ రిపోర్ట్ చేసి వచ్చాడు. అయ్యప్ప మాల వేసుకున్న భరత్.. కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ వెళ్తు మృతి చెందాడు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి సీతక్క
రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోవడంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారి గురించి ఎంజీఎం డాక్టర్లను ఆరా తీసి, మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని కోరారు.