IND vs NZ 2nd Test: 12 ఏళ్ళ తర్వాత టెస్ట్ సిరీస్ ఓటమి.. భారత ఓటమికి కారణాలివే

స్వదేశంలో ఏ జట్టయినా కింగే. ముఖ్యంగా టెస్టుల్లో ఆతిధ్య జట్టుకు తిరుగుండదు. బంగ్లాదేశ్ నుంచి ఆస్ట్రేలియా వరకు సొంతగడ్డపై అని జట్లు చెలరేగిపోతాయి. ఇక ఈ విషయంలో భారత క్రికెట్ జట్టు అందరికంటే ఒక అడుగు ముందుకే ఉంటుంది. టీమిండియాతో స్వదేశంలో మ్యాచ్ అంటే సిరీస్ కు ముందు ప్రత్యర్థి సగం ఆశలు వదులుకుంటుంది. 12 ఏళ్లుగా ప్రత్యర్థిని వణికిస్తూ ఒక్క సిరీస్ ఓడిపోకుండా విజయాలు సాధిస్తూ వచ్చింది.

స్వదేశంలో న్యూజిలాండ్ తో సిరీస్ అనేసరికి మరో సిరీస్ ఖాతాలో వేసుకోవచ్చు అనుకున్నారు. అయితే రెండు వారాలు గడిచేసరికి భారత్ కు న్యూజిలాండ్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. భారత్ లో టెస్ట్ మ్యాచ్ గెలవడమే కష్టం అనుకున్న దశలో.. పూణే టెస్టులోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకొని  సంచలనం సృష్టించింది. తమ దేశ క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద టెస్ట్ సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. బౌలింగ్ లో పర్వాలేదనిపించిన మన జట్టు బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశ పరిచింది. భారత్ ఈ సిరీస్ ఓడిపోవడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. 

సీనియర్లు బాధ్యతారాహిత్యం 

భారత టెస్ట్ క్రికెట్ లోకి ఇప్పుడిప్పుడే యువ క్రికెటర్లు వచ్చి సత్తా చాటుతున్నారు. వారు  జట్టులో పాతుకుపోవడానికి వీలైనంత ఎక్కువ సమయం ఇవ్వాలి. ఈ క్రమంలో సీనియర్లు జట్టును ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది. టెస్ట్ క్రికెట్ లో ఎంతో అనుభవమున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ భారత్ టెస్ట్ సిరీస్ ఓడిపోవడానికి ప్రధాన బాధ్యులు. ఏదో ఆట రానట్టు ఇలా వచ్చి అలా వెళ్లారు. బెంగళూరు టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో రోహిత్, కోహ్లీ అర్ధ సెంచరీ మినహాయిస్తే ఈ సిరీస్ లోని మిగిలిన మూడు ఇన్నింగ్స్ లో దారుణమైన ఆట తీరుతో భారత్ ను ముంచారు. 

Also Read :- ఇకనైనా బుద్ధిగా ఉండు కొడకా..! క్రికెటర్‌కు తల్లి సలహా

ప్రస్తుతం జరుగుతున్న పూణే టెస్టులో రోహిత్, కోహ్లీ ఇద్దరూ రెండు ఇన్నింగ్స్ ల్లో విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్ లు కలిపి రోహిత్ 10 పరుగులు చేస్తే.. విరాట్ కోహ్లీ 18 పరుగులతో సరిపెట్టుకున్నాడు. అంతకముందు బంగ్లాదేశ్ సిరీస్ లోనూ వీరిద్దరూ విఫలమయ్యారు. స్వదేశంలోనే వీరు జట్టును ఆదుకోకపోతే విదేశాల్లో మన పరిస్థితి ఏంటి అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

న్యూజిలాండ్ క్రమశిక్షణ

ఈ సిరీస్ గమనిస్తే న్యూజీలాండ్ గాలివాటంగా గెలిచారనుకుంటే పొరపాటే. ఎందుకంటే భారత్ లాంటి పిచ్ లపై  క్రమశిక్షగా ఆడితేనె విజయం వస్తుంది. ఈ విషయంలో న్యూజిలాండ్ తూచా తప్పకుండా పాటించింది. ప్రతి ఒక్కరూ సమిష్టిగా ఆడి విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. తొలి టెస్టు పేసర్లకు అనూకిలిచడంతో తుది జట్టులో ముగ్గురు పేసర్లను ఆడించింది. హెన్రీ 5 వికెట్లు తీసి సత్తా చాటినా.. అతన్ని రెండో టెస్టులో పక్కన పెట్టి సాంట్నర్ తీసుకొచ్చారు. సాంట్నర్ రెండు ఇన్నింగ్స్ ల్లో 13 వికెట్లు తీసి భారత్ పని పట్టాడు. పిచ్ కు తగ్గట్టు కివీస్ చేసిన మార్పులు అనుకూల ఫలితాలు తీసుకు వచ్చాయి. 

ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయడం:
 
స్వదేశంలో భారత్ ఓడిపోవడం కొత్తేమి కాదు. చాలా సిరీస్ ల్లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత వెంటనే కంబ్యాక్ ఇచ్చేవారు. కానీ ఈ సారి అలా జరగలేదు. ఓడిపోయినా మాకు పుంజుకోవడం మామూలే అన్నట్టు రెండో టెస్టులో ఒక ప్లానింగ్ లేకుండా బరిలోకి దిగారు. తుది జట్టులో సుందర్ ను తీసుకోవడం మినహాయిస్తే ఏదీ కలిసి రాలేదు. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడం భారత్ పరాజయానికి ఒక కారణం.

స్పిన్ ఆడలేకపోవడం:

భారత జట్టు స్పిన్ ఎంత చక్కగా ఆడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఎంతోమంది ప్రత్యర్థి  స్టార్ స్పిన్నర్లకు భారత పర్యటన పీడకలగా మారింది. అయితే గత నాలుగేళ్లలో భారత్ స్పిన్ ఆడడంలో బాగా బలహీనంగా మారింది. ముఖ్యంగా స్టార్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీ స్పిన్ దెబ్బకు చేతులెత్తుస్తున్నారు. కోహ్లీ స్వదేశంలో చివరి 27 ఇన్నింగ్స్ ల్లో ఏకంగా 22 సార్లు స్పిన్ బౌలింగ్ లో ఔటయ్యారు. సాంట్నర్ లాంటి ఒక స్పిన్ ఆల్ రౌండర్ బౌలింగ్ ను మనవాళ్లు ఆడలేకవడం విచారకరం. పార్ట్ టైం బౌలర్ గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ లోనూ ఆడడానికి ఇబ్బంది పడ్డారు.