టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మంగళవారం (జూన్ 4) ఉగాండాపై జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ లో ఆ తర్వాత బౌలింగ్ లో చెలరేగి బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘానిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఉగాండా 58 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి వచ్చిన వారు వచ్చినట్టు పెవిలియన్ చేరారు. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్ధాన్ వరల్డ్ కప్ లో ఏకంగా నాలుగు రికార్డ్స్ నెలకొల్పడం విశేషం.
ఓపెనింగ్ అదుర్స్
ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు గుర్బాజ్, జద్రాన్ మొదటి వికెట్‌కు 154 పరుగులు జోడించారు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇది రెండో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. ఇంగ్లాండ్ ఓపెనింగ్ భాగస్వామ్యం జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ తొలి వికెట్ కు అజేయంగా 170 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు.
4వ అతి పెద్ద విజయం
ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 125 పరుగుల భారీ తేడాతో గెలిచింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇది నాలుగో అతి పెద్ద విజయం. 2007 వరల్డ్ కప్ లో కెన్యాపై శ్రీలంక 172 పరుగుల తేడాతో గెలుపొంది ఈ లిస్ట్ లో టాప్ లో ఉంది.
3. ఫజల్‌హాక్ ఫరూఖీ అత్యుత్తమ గణాంకాలు
ఈ మ్యాచ్‌లో ఫరూఖీ సంచలన బౌలింగ్‌తో చెలరేగిపోయాడు. 4 ఓవర్లు వేసిన ఫారుకీ.. కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ కప్ చరిత్రలో ఇది నాలుగో అత్యుత్తమ గణాంకాలు. శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ 8 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు.
4. టీ20 ప్రపంచకప్‌లో ఉగాండా నాలుగో అత్యల్ప స్కోరు
ఈ మ్యాచ్ లో ఉగాండా 58 పరుగులకే ఆలౌటైంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇది నాలుగో అత్యల్ప స్కోరు. ఓవరాల్ గా 2014 ఎడిషన్‌లో శ్రీలంకపై నెదర్లాండ్స్ (39) అత్యల్ప స్కోర్ నమోదు చేసింది.