లోయలో పడిన ట్రక్కు.. నలుగురు జవాన్లు మృతి

లోయలో పడిన ట్రక్కు.. నలుగురు జవాన్లు మృతి

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ఆర్మీ ట్రక్కు లోయలో పడి నలుగురు జవాన్లు మృతి చెందారు. మరికొందరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. బందిపూర్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సదర్ కూట్ పాయెన్ సమీపంలో ట్రక్కు మూలమలుపు తిరుగుతుండగా.. అదుపు తప్పి కొండపై నుంచి  లోయలో పడిపోయిందని ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం, విజిబిలిటీ సరిగా లేకపోవడంవల్లే ప్రమాదం జరిగిందని వారు వెల్లడించారు. గాయపడిన సైనికులందరినీ స్థానిక యువకుల సహాయంతో దగ్గర్లోని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. వారిలో ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన దురదృష్టకరమని, నలుగురు ధైర్యవంతులయిన సైనికులను కోల్పోయామని, భారత సైన్యం మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపింది. 

జమ్మూ కాశ్మీర్​లో ఆర్మీ వెహికల్స్​ ప్రమాదానికి గురికావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది డిసెంబర్ 24న పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహనం అదుపుతప్పి 350 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ఉగ్ర కోణంలేదని ఆర్మీ తేల్చి చెప్పింది. అలాగే, నవంబర్ 4 రాజౌరి జిల్లాలో ఆర్మీ వెహికల్​రోడ్డు పైన స్కిడ్ అయి పక్కనున్న లోయలో పడిపోయింది. ఈ యాక్సిడెంట్​లో ఒక సోల్జర్ చనిపోయాడు. మరొకరు గాయపడ్డారు. నవంబర్ 2 రియాసి జిల్లాలో ఆర్మీ కారు కొండ రహదారి నుంచి జారిపడి లోతైన లోయలో పడింది. ఈ ప్రమాదంలో మహిళ, ఆమె 10 నెలల కొడుకుతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.