జీహెచ్ఎంసీలో 4 వేల పోస్టులు ఖాళీ!

  •  భర్తీపై కసరత్తు.. విభాగాల వారీగా ప్రభుత్వానికి నివేదికలు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలోని ఖాళీల భర్తీకి కసరత్తు మొదలైంది. విభాగాల వారీగా ఖాళీ పోస్టుల లెక్కలు తీస్తున్నారు. 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 9 వేల మంది ఉద్యోగులు ఉండాలి. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 5 వేల లోపే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్​హైదరాబాద్ అభివృద్ధిపై స్పెషల్​ఫోకస్ పెట్టింది. 

ఇందులో భాగంగా మహా నగరంలో కీలకమైన బల్దియాలోని ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఉన్నతాధికారులు విభాగాల వారీగా ఖాళీ పోస్టులపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నారు. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ విభాగానికి 200 మంది టౌన్ ప్లానింగ్ సర్వేయర్లు(టీపీఎస్), పరిపాలన విభాగానికి 200 మంది జూనియర్ అసిస్టెంట్లు అవసరమని నివేదించారు.

 ఇంజనీరింగ్, శానిటేషన్, హెల్త్, ఫైనాన్స్, ఈవీడీఎం, ఎస్టేట్స్ తదితర విభాగాలకు ఎంత మంది అవసరమన్న వివరాలను అడ్మినిస్ట్రేషన్ అధికారులు సేకరిస్తున్నారు. ఆ వెంటనే విభాగాల హెచ్ఓడీలకు ఇవ్వాలని అడ్మినిస్ట్రేషన్ అడిషనల్​కమిషనర్​లెటర్​రాశారు. 

ఔట్ సోర్సింగ్​లోనూ.. 

గ్రేటర్​జనాభాకు పూర్తిస్థాయిలో సేవలు అందించేందుకు జీహెచ్ఎంసీకి 80 వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది కావాలి. అయితే ప్రస్తుతం 27 వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో అక్కడి జనాభాకు సరిపడా ఔట్​సోర్సింగ్​సిబ్బంది ఉన్నారు. మన దగ్గరతో పోలిస్తే రెండు, మూడింతలు ఎక్కువనే ఉన్నారు. చిన్న సిటీ అయిన పుణెలో హైదరాబాద్​లో కంటే ఎక్కువ మంది ఔట్​సోర్సింగ్​స్టాఫ్ పనిచేస్తున్నారు. 

తెలంగాణ ఆవిర్భావం తర్వాత వేసిన ప్రసాద్ రావు కమిటీ, ఆల్​పార్టీ కమిటీలు ఔట్​సోర్సింగ్​లో 60 శాతం ఖాళీలు ఉన్నాయని, తక్షణమే పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాయి. గత ప్రభుత్వం ఎలాంటి రిక్రూట్​మెంట్ చేయలేదు. గడిచిన 13 ఏండ్లలో ఔట్ సోర్సింగ్ కింద కొత్తవారిని 
తీసుకోలేదు. 

బీఆర్ఎస్ సర్కార్​ పట్టించుకోలే

బీఆర్ఎస్ హయంలో జీహెచ్ఎంసీని అస్సలు పట్టించుకోలేదు. బల్దియాను కేవలం ఆదాయ వనరుగా మాత్రమే చూసింది. ఖజానాను ఖాళీ చేసి, రూ.5 వేల కోట్ల అప్పలను మిగిల్చింది. ఉద్యోగ ఖాళీల భర్తీ చేయలేదు. ఫలితంగా ఉన్నవారిపైనే పనిభారం పడింది. 2012లో ప్రసాద్ రావు కమిటీ ఆధారంగా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పినప్పటికీ, తర్వాత పట్టించుకోలేదు. జీహెచ్ఎంసీలో వేలాది పోస్టులు ఖాళీగా ఉండటానికి బీఆర్ఎస్ సర్కారే కారణం. పైగా పదవీ విరమణ పొందినవారిని ఏండ్లపాటు కొనసాగించింది.