యాదాద్రి/చౌటుప్పల్, వెలుగు: సంక్రాంతి పండుగ కోసం పట్నం నుంచి సొంతూళ్లకు వెళ్తున్న వారి సంఖ్య ఆదివారం కూడా అదే స్థాయిలో ఉంది. వీకెండ్ సెలవులు రావడంతో హైదరాబాద్ నుంచి జనాలు శుక్రవారం నుంచే సొంత ఊర్లకు ప్రయాణం కట్టారు. దీంతో శుక్ర, శనివారాల్లో జనం భారీ ఎత్తున సొంతూర్లకు వెళ్లారు. అయితే, శనివారం ట్రాఫిక్‌తో పోలిస్తే ఆదివారం వాహన రద్దీ కొంత తగ్గింది.
గంటకు 4 వేల వాహనాలు రాకపోకలు సాగించాయి. హైదరాబాద్–- విజయవాడ హైవేలో వెహికల్స్ ఎక్కువగా ప్రయాణించాయి. శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం రాత్రి వరకూ దాదాపు 60 వేల వెహికల్స్ ఆ మార్గం మీదుగా వెళ్లాయి. వీటిలో విజయవాడ వైపు 40 వేల వాహనాలు వెళ్లగా, హైదరాబాద్ వైపు 20 వేల వెహికల్స్ ప్రయాణించాయి. అయితే, పంతంగి టోల్ గేట్ వద్ద పెద్దగా ట్రాఫిక్ కనిపించనప్పటికీ.. చౌటుప్పల్ టౌన్లో వాహన రద్దీ నెలకొంది. కాగా.. శుక్రవారం 59 వేలు, శనివారం లక్షకు పైగా వాహనాలు పంతంగి టోల్ గేట్ మీదుగా ప్రయాణించాయి.
వరంగల్ హైవేలో
హైదరాబాద్ – వరంగల్ హైవేపై వాహనాల రద్దీ ఆదివారం కొంత తగ్గింది. ఈ మార్గంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకూ దాదాపు 40 వేల వెహికల్స్ ప్రయాణించాయి. వరంగల్ వైపు దాదాపు 26 వేల వాహనాలు వెళ్లగా.. హైదరాబాద్ వైపు 14 వేల వెహికల్స్ ప్రయాణించాయి. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.