నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్!

నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్!
  • పీసీసీ కార్యవర్గంపై ఢిల్లీలో కసరత్తు
  • ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనార్టీలకు చాన్స్
  • సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం
  • పరిశీలనలో పలువురు సీనియర్ల పేర్లు
  • ఉపాధ్యక్షుల నియామకంపైనా ఫోకస్

హైదరాబాద్/ఢిల్లీ: పీసీసీ కార్యవర్గ విస్తరణపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సారి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించనున్నారు. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని ఈ నియామకాలు పూర్తి చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. పీసీసీ చీఫ్ గా బీసీ వర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్ కొనసాగుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించనున్నారు. ఆయా వర్గాలకు చెందిన నలుగురు నేతలను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమిస్తారని సమాచారం అందుతోంది. ఉపాధ్యక్షులపైనా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. 

ఇటీవల బీసీ  కులగణన లెక్కలను  ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పీసీసీ కార్యవర్గంలో బీసీలకు 50 నుంచి 60 శాతం పదవులు కేటాయించనున్నట్టు ప్రకటించారు. దీంతో సారి బీసీలకు పీసీసీలో ఎక్కువగా పదవులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. 

రేసులో ఉన్నది వీళ్లే..

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులకు పలువురు రేసులో ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం కోటాలో మాదిగ కులానికి అడ్లూరి లక్ష్మణ్​ కు ఈ పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే విధంగా ఓసీ కోటాలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్​ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. మైనార్టీ వర్గం నుంచి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్, నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ పేర్లు పరిశీలో ఉన్నాయని సమాచారం. ఎస్టీలకు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఈ సారి లంబాడా కమ్యూనిటీకి కేటాయించే చాన్స్ ఉంది. బెల్లయ్య నాయక్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.