సూపర్ మార్కెట్లో కరెంట్ షాక్తో నాలుగేళ్ల చిన్నారి మృతి

సూపర్ మార్కెట్.. సరుకులు కొనటానికి వెళ్లి ఎవరైనా చనిపోయారు అంటే నమ్ముతారా.. అస్సలు నమ్మలేం.. అది కూడా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తూ.. ఓ చిన్నారి కరెంట్ షాక్ తో చనిపోయింది అంటే నమ్మగలమా.. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి ఘటన జరగలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా నందిపేట పట్టణంలోని ఎన్(N) మార్ట్ సూపర్ మార్కెట్ లో ఈ ఘటన జరిగింది. దేశం మొత్తం షాక్ అయిన ఘటనతో.. అందరూ షాక్ అయ్యారు. 2023, అక్టోబర్ 2వ తేదీ.. గాంధీ జయంతి నాడు జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

నందిపేట పట్టణంలో ఎన్ మార్ట్ అనే సూపర్ మార్కెట్ ఉంది. ఇక్కడికి నాలుగేళ్ల చిన్నారి రుషిత.. తన తండ్రితో కలిసి వస్తువులు కొనుగోలు చేయటానికి సూపర్ మార్కెట్ కు వచ్చింది. ఈ క్రమంలోనే మాల్ లోని ఫ్రిడ్జిలో చాక్లెట్లు తీసుకునేందుకు డోర్ పట్టుకున్నది.. వెంటనే కరెంట్ షాక్ కొట్టింది. చిన్నారి గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోయింది. తండ్రితోపాటు మాల్ సిబ్బంది చిన్నారి రుషితను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పాప చనిపోయినట్లు చెప్పారు డాక్టర్లు.

సూపర్ మార్కెట్ కు వెళ్లిన చిన్నారి.. చాక్లెట్ల కోసం ఫ్రిడ్జ్ పట్టుకోవటం.. షాక్ కొట్టటం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ ఘటన కలకలం రేపుతోంది. ఎందుకంటే నిత్యం లక్షల మంది సూపర్ మార్కెట్లకు వెళుతుంటారు.. అక్కడ ప్రిడ్జిలు ఓపెన్ చేస్తుంటారు.. పాల కోసం.. చాక్లెట్ల కోసం.. ఐస్ క్రీమ్స్ కోసం.. అలాంటిది మాల్ లోని ఓ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తూ నాలుగేళ్ల చిన్నారి చనిపోవటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. 

ఎన్ మార్ట్ యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యం.. సరైన పద్దతులు పాటించకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.