
వాషింగ్టన్: ఇంట్లో దొంగతనం జరిగిందనో.. పక్కింటి వాళ్లు గొడవ పడుతున్నారనో.. ప్రమాదంలో ఉన్నాం కాపాడండనో.. పోలీసులకు ఫోన్ చేస్తుంటాం. కానీ, అమెరికాలో ఓ నాలుగేండ్ల బుడ్డోడు ‘మా అమ్మను అరెస్ట్ చేయండి’ అని పోలీసులకు ఫోన్ చేశాడు. ఇంతకీ వాళ్ల అమ్మ చేసిన నేరం ఈ బుడ్డోడి ఐస్‌క్రీం తినేయడమే. అసలు ఏం జరిగిందంటే.. విస్కాన్సిన్ రాష్ట్రంలో ఓ నాలుగేండ్ల బాలుడికి ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ను వాళ్ల అమ్మ కొనుక్కొచ్చి ఇంట్లో ఫ్రిజ్‌లో పెట్టింది.
అయితే, ఆ చిన్నారికి తెలియకుండా ఫ్రిజ్‌లో ఉన్న ఐస్‌క్రీమ్‌ను ఆ తల్లి తినేసింది. కొద్దిసేపటి తర్వాత ఐస్‌క్రీమ్ తిందామని ఆ చిన్నారి ఫ్రిజ్ తెరిచి చూడగా, అందులో కనిపించలేదు. దీంతో బాధపడిన ఆ బాలుడు.. వెంటనే 911కి కాల్ చేశాడు. ‘మా అమ్మ నా ఐస్‌క్రీమ్‌ను దొంగతనం చేసి, తినేసింది. మీరు వచ్చి ఆమెను అరెస్ట్ చేయండి’ అని పోలీసులను కోరాడు. కొద్దిసేపటి తర్వాత బాలుడి ఇంటికి వచ్చిన పోలీసులను చూశాక మాటమార్చేశాడు. ‘మమ్మీ లేకుండా ఉండలేను, మమ్మీని అరెస్ట్ చేయొద్దు’ అని చెప్పాడు.