- దాహం తీర్చుకునేందుకు వెళ్లిన 40 బర్రెలు ప్రమాదంలో ..
- గంటల తరబడి కాలువలో కొట్టుమిట్టాడినయ్..
- చివరకు నీటిని ఆపడంతో క్షేమంగా ఒడ్డుకు చేరిన పశువులు
జగిత్యాల జిల్లా : వరద కాలువలో దాహం తీర్చుకునేందుకు వెళ్లిన 40 బర్రెలు ప్రమాదంలో చిక్కుకుని కొన్ని గంటల తర్వాత క్షేమంగా ఒడ్డుకు చేరాయి. ఈ సంఘటన శనివారం జగిత్యాల జిల్లా, మల్యాల మండలంలోని రాంపూర్ లో చోటుచేసుకుంది. 40 పశువులు ముత్యంపేటకు చెందిన రైతు ప్రకాష్ రెడ్డికి చెందినవిగా గుర్తించారు. బ్రిడ్జిపై నుంచి వాహనదారులు చూస్తుండగా ప్రమాదానికి గురైన బర్రెలు నీటిలో తేలియాడుతూ గుంపుగా పోతున్నాయన్నారు. గంటలతరబడి పశువులు కాలువలో కొట్టుమిట్టాడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని బ్రిడ్జిపై వెళ్తున్న వాహనదారులు తెలిపారు. నీటి తాకిడికి ఒడ్డుకు చేరుకోలేకపోతున్నాయన్నారు.
అయితే ముత్యంపేట శివారులోని రాంపూర్ వరద కాలువ 73 కి.మీ. పంప్ హౌస్ దగ్గర గేట్లు మరమ్మతులు చేయడానికి నీటిని నిల్వ ఉంచడంతోనే కాలువలో ఎక్కువ నీళ్లు ఉన్నాయని రైతులు చెప్పారు. నిత్యం ఇన్ని నీళ్లు ఉండేవి కావని.. ఈ విషయం తెలియని మూగజీవాలు ఎప్పటిలాగే దాహం తీర్చుకునేందుకు కాలువలోకి వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్నాయని తెలిపారు. పశువులను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని రైతులు చెప్పారు.
అయితే ఈ విషయం తెలియగానే నీటిని ఆపేశామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. దీంతో కాలువలో నీటిశాతం తగ్గడంతో బల్వంతాపూర్ దగ్గర తాళ్ల సహాయంతో బర్రెలను స్ధానికులు ఒడ్డుకు చేర్చారని చెప్పారు. 40 బర్రెలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని.. స్థానికులకు, ఇరిగేషన్ అధికారులకు ధన్యవాదాలు తెలిపాడు పశువుల యజమాని ప్రకాష్ రెడ్డి.
గంటల తరబడి నీటిలోనే 40 బర్రెలు..స్ధానికుల సాయంతో క్షేమంగా ఒడ్డుకు pic.twitter.com/HQcvQ6sQxq
— V6 News (@V6News) June 4, 2022