- సూర్యాపేట జిల్లాలో 40 శాతం కెమెరాలు మూలన పడ్డాయి..
- పెరుగుతున్న నేరాలు.. కేసుల ఛేదనలో ఇబ్బందులు
- ఆందోళనలో ప్రజలు.. పట్టించుకోని అధికారులు
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఉన్నా లేనట్లుగానే ఉంది. చాలా చోట్ల నిఘా కెమెరాలు పనిచేయడం లేదు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రమాదాలు, నేరాలు జరిగినప్పుడు త్వరగా గుర్తించలేకపోతున్నారు. ఇటీవల జిల్లాలో సంచలనం సృష్టించిన మర్డర్ కేసులను సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో పోలీసులు ఛేదించలేకపోయారు.
మూడువేల పైనే...
జిల్లాలో కమ్యూనిటీ కెమెరాలు 1703 ఉండగా, నేను సైతం కింద 1761 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఒక్కో స్టేషన్ పరిధిలో 20కి పైగా సీసీ కెమెరాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ఎస్పీ ఆఫీస్ లో 2019లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో మానిటరింగ్ చేస్తున్నారు.
పర్యవేక్షణ లేక..
లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వేల సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా పర్యావేక్షణ లేక 40 శాతం కెమెరాలు మూలనపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో టెక్నికల్ స్టాఫ్ లేకపోవడంతో వాటి నిర్వహణ ఎవరు చేయాలన్నది ప్రశ్నార్ధకంగా మారింది. జిల్లాలోని అన్నీ పోలీస్ స్టేషన్లలో కేవలం 15మంది మాత్రమే టెక్నికల్ స్టాఫ్ ఉండగా స్టేషన్లలో పనులకే వారిని పరిమితం చేస్తున్నారు. దీంతోపాటు సీసీ కెమెరాల రిపేర్ల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ లేకపోవడంతో వాటి నిర్వహణ కష్టమవుతోంది.
కేసుల ఛేదన జాప్యం
సీసీ కెమెరాలు పనిచేయని చోట ఏవైనా నేరాలు జరిగితే వాటిని ఛేదించేందుకు చాలా సమయం పడుతోంది. గతేడాది సూర్యాపేటకు చెందిన నిఖిల్ అనుమానాస్పద స్థితిలో చిలుకూరు వద్ద ఎన్నెస్పీ కెనాల్ లో పడి మృతి చెందాడు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నా పని చేయకపోవడంతో అది హత్యా? ఆత్మహత్యా? అనేది నేటికీ పోలీసులు కనిపెట్టలేకపోయారు. చివరకు ఈ కేసును సీఐడీకి అప్పగించారు. నెల రోజుల కింద సూర్యాపేట కలెక్టరేట్ లో పని చేస్తున్న వ్యక్తి డ్యూటీ ముగించుకొని దురాజ్ పల్లి నుంచి సూర్యాపేటకు వస్తున్నాడు. శాంతినగర్ ఎఫ్‌సీఐ గోడౌన్ వద్ద గుర్తు తెలియని వెహికల్అతడిని ఢీకొట్టడంతో చనిపోయాడు. కానీ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నా ఢీకొట్టిన వాహనం ఏది అని తేల్చలేని పరిస్థితి ఉంది.
వారం రోజుల కింద సూర్యాపేట జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలోని చివ్వేముల పోలీస్ స్టేషన్ లో ప్రేమజంట వ్యవహారంలో గొడవ జరి గింది. అమ్మాయి తరుపు బంధువులు యువకుడిని కొట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే కేసు విషయంలో వచ్చిన వ్యక్తిని ఎస్సై పాత కక్షలను మనసులో పెట్టుకొని ఎస్సై స్టేషన్ లోనే చితకబాదాడు అనే ఆరోపణలు ఉన్నా యి. ఈ క్రమంలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు పరిశీలించాలంటే ఒక్కటి కూడా పనిచేయట్లేదు. ఇప్పటికైనా సీసీ కెమెరాలను రిపేర్లు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.