ఎంజీఎంలో ఒకేరోజు 40 మంది డాక్టర్లు డుమ్మా

  • రిజిస్టర్​లో నెల సంతకాలు ముందే పెట్టుకున్న మరో డాక్టర్
  • వరంగల్​ కలెక్టర్ ​తనిఖీలో బయటపడ్డ బాగోతం
  • ముందస్తు సంతకాల డాక్టర్‍ సస్పెన్షన్​పై డీఎంఈకి సిఫారసు
  • విధులకు గైర్హాజరైన సిబ్బందికి షోకాజ్‍ నోటీసులు
  • రోగుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని డాక్టర్లు, సిబ్బందిపై ఆగ్రహం 
  • ఎంజీఎం సూపరింటెండెంట్‍ను సంజాయిషీ అడిగిన కలెక్టర్‍ 

వరంగల్‍/వరంగల్‍ సిటీ, వెలుగు: వరంగల్‍ ఎంజీఎం హాస్పిటల్​లో శనివారం ఒకేరోజు 40 మంది డాక్టర్లు విధులకు డుమ్మాకొట్టారు.  ఓ డాక్టర్​ అయితే అటెండెన్స్​ రిజిస్టర్​లో జులై నెల మొత్తం విధులకు హాజరైనట్టు ముందే సంతకాలు పెట్టేసుకున్నడు.  ఇంకొందరు వైద్యసిబ్బంది ఉదయం 11 గంటలు అయినా.. హాస్పిటల్​కు రాలేదు. వరంగల్‍ లోని ఎంజీఎం హాస్పిటల్​లో జిల్లా కలెక్టర్ శారదాదేవి శనివారం  ఆకస్మిక తనిఖీ చేయగా, వైద్యుల బాగోతం బయటపడింది. కలెక్టర్లంతా ఆఫీసులు దాటి  ఫీల్డ్​లో తిరగాలని ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి సూచించగా.. వరంగల్‍ కలెక్టర్‍ వరుసగా రెండోరోజు ఎంజీఎం హాస్పిటల్​లో ఆకస్మికంగా పర్యటించారు. 

శనివారం ఉదయం దాదాపు 11.20 గంటలకు దవాఖాన లోపలికి చేరుకున్న కలెక్టర్‍ మధ్యాహ్నం 3 గంటల వరకు తనిఖీలు, సమీక్షలు నిర్వహించి.. వైద్యులు, సిబ్బందికి ముచ్చెమటలు పట్టించారు. ఎంజీఎంపై సీఎం రేవంత్‍రెడ్డి  ప్రత్యేక దృష్టి సారించారని, విధుల్లో అలసత్వంగా ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.  

ప్రతి వార్డు కలియదిరిగిన కలెక్టర్

ఎంజీఎంలో ఆకస్మిక తనిఖీలకు వెళ్లిన కలెక్టర్‍ శారదాదేవి  ప్రతివార్డులో కలియదిరిగారు.  ముందుగా ఔట్‍ పేషెంట్‍ జనరల్‍ మెడిసిన్‍, జనరల్‍ సర్జరీ, ఆర్థోపెడిక్‍, సైక్రియాటిక్‍, న్యూ మేల్‍ సర్జికల్‍ వార్డ్, ఇంటెన్సివ్‍ కేర్‍ సర్జికల్‍ యూనిట్‍, పిల్లల ఐసీయూ, పీఐసీయూ, ఎస్‍ఎన్‍సీయూ, సెంట్రల్‍ ల్యాబ్‍, రేడియాలజీ, ఎమర్జెన్సీ క్యాజువాలిటీలకు వెళ్లి పేషెంట్లతో మాట్లాడారు. వైద్యసేవలు, ఎక్స్ రే, స్కానింగుల తీరు, మందులు అందుతున్న విధానంపై ఆరా తీశారు. 

తాగునీరు ఎలా ఉందో చెక్​చేశారు. వచ్చిన పేషెంట్లకు ఇన్​టైంలో వైద్యం అందకపోవడంపై సిబ్బంది మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔట్‍ పేషెంట్‍తో పాటు ఎమర్జెన్సీ విభాగాలకు వచ్చే బాధితులకు కూర్చునేందుకు బల్లలు వేయాలని ఆదేశించారు. చాలామంది డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై సీరియస్‍ అయ్యారు. నేరుగా సూపరింటెండెంట్‍ కార్యాలయానికి చేరుకున్నారు. ఆఫీసర్ల చాంబర్‍ చూసి ఆశ్చర్యపోయారు. రోగులకు నిల్చునేందుకు, కూర్చునేందుకు  స్థలం లేకుంటే సూపరింటెండెంట్​కు ఇంతపెద్ద ఆఫీస్‍ అవసరమా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. అక్కడ నిరుపయోగంగా ఉన్న గదులను వార్డులుగా మార్చాలని ఆదేశించారు.

ఎంజీఎం పోర్టల్‍ తీసుకొస్తాం

రాష్ట్రంలో ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం హాస్పిటల్​ సమస్త సమాచారం తెలిపేందుకు పోర్టల్​ను త్వరలో  తీసుకురానున్నట్టు కలెక్టర్​వెల్లడించారు. హాస్పిటల్​లో ఉన్న దుకాణాలు, డబ్బాలనుంచి ఎందుకు హాస్పిటల్‍ డెవలప్‍మెంట్‍ ఫండ్ వసలూ చేయట్లేదని సూపరింటెండెంట్‍ను ప్రశ్నించారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‍ మాట్లాడుతూ.. విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం హస్పిటల్లోని సమస్యలు, సౌకర్యాలపై డీఎంఈ వాణితో కలిసి హాస్పిటల్‍ హెచ్​వోడీలతో సమావేశమయ్యారు. కలెక్టర్‍ వెంట అడిషనల్‍ కలెక్టర్‍ సంధ్యారాణి, ఆర్డీవో కృష్ణవేణి, ఎంజీఎం సూపరింటెండెంట్‍ చంద్రశేఖర్‍, ఆర్‍ఎంఓలు, మురళి, శ్రీనివాస్‍ ఉన్నారు.

వైద్యుల నిర్లక్ష్యంపై కలెక్టర్​ ఫైర్​

తనిఖీల్లో భాగంగా  కలెక్టర్​ శారదా దేవి డాక్టర్ల అటెండెన్స్​ రిజిస్టర్​ను పరిశీలించారు. అందులో పిడియా ట్రిక్‍ విభాగానికి చెందిన ప్రొఫెసర్‍ శ్యామ్‍ ప్రసాద్‍ జులై నెల మొత్తం డ్యూటీలకు హాజరైనట్టు రిజిస్టర్​లో ముందస్తుగా సంతకాలు చేసినట్టు గుర్తించారు. దీంతో అధికారుల తీరుపై సీరియస్‍ అయ్యారు. వైద్య సిబ్బంది అంత నిర్లక్ష్యంగా ఉండటా నికి అధికారుల తీరే కారణమని ఫైర్​ అయ్యారు. 

ముందస్తుగా సంతకాలు పెట్టిన డాక్టర్‍ ను సస్పెండ్ చేయాలని డీఎంఈకి సిఫారసు చేశారు. సుమా రు 40 మంది డాక్టర్లు విధులకు గైర్హా జరైనట్టు తెలుసుకొని, వారికి షోకా జ్‍ నోటీసులు జారీ చేశారు. డుమ్మా కొట్టిన వైద్యులపై సోమవారంలోపు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సూపరింటెండెంట్‍ చంద్ర శేఖర్‍ను సంజాయిషీ అడిగారు. రోగులపట్ల పలువురు నర్సులు దురు సుగా ప్రవర్తిస్తున్నారని కలెక్టర్​ ఆగ్రహం వ్యక్తంచేశారు. పనితీరు మార్చుకోవాలని వారిని హెచ్చరించారు.