లీకవుతున్న పెట్రోల్‌ పట్టుకునేందుకు వెళ్లి 40మంది మృతి

లైబీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంక్ పేలడంతో దాదాపు 40మంది మృతి చెందారు. డిసెంబర్ 28వ తేదీ గురువారం  లైబీరియాలోని టొటోటా పట్టణంలో చోటుచేసుకుంది. ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డు ప్రక్కన బోల్తా పడింది. ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకవుతుండడంతో...  స్థానికులు ఆయిల్ ను పట్టుకునేందుకు భారీగా అక్కడికి వెళ్లారు.  ఈ క్రమంలో ఒక్కసారిగా ఆయిల్ ట్యాంకర్ బ్లాస్ట్ అయ్యింది. ఈ ఘటనలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మరో 100మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

చాలామంది మంటల్లో సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది, అగ్నమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతదేహలు గుర్తు పట్టని విధంగా ఉన్నాయని అధికారులు చెప్పారు.