అడ్రస్ కు వెళ్తే దరఖాస్తుదారులు ఉండట్లేదు

అడ్రస్ కు వెళ్తే దరఖాస్తుదారులు ఉండట్లేదు
  • ఫోన్లు చేసినా కలవట్లేదని పక్కన పెట్టేస్తున్న పరిస్థితి
  • తమ వద్దకు ఎవరూ రాలేదంటున్న దరఖాస్తుదారులు
  • ఇల్లు రాదేమో అని బల్దియా ఆఫీసులకు పరుగులు
  • కొన్ని ప్రాంతాల్లో నామమాత్రంగా వెరిఫికేషన్

 

హైదరాబాద్, వెలుగు:
గ్రేటర్​పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం వచ్చిన అప్లికేషన్లలో 40 శాతం రిజెక్ట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. అప్లికేషన్లలో పొందుపర్చిన అడ్రస్​లలో దరఖాస్తుదారులు లేకపోవడం, ఫోన్ నంబర్లు కలకపోవడమే కారణంగా తెలుస్తోంది. డబుల్​ బెడ్రూం ఇండ్ల కోసం మొత్తం 7.10 లక్షల అప్లికేషన్లు రాగా.. ఆరేండ్ల తర్వాత జీహెచ్ఎంసీ  అధికారులు వెరిఫికేషన్​ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ ఐడీ కార్డు, కమ్యూనిటీ వివరాలను ఆవాస్​ యాప్ లో ఎంటర్ ​చేస్తున్నారు. ఈ ప్రాసెస్​ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే అప్లికేషన్లలో పొందుపర్చిన అడ్రస్​లకు వెళ్తే దరఖాస్తుదారులు ఉండట్లేదనే సమాధానం వస్తుందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఇక్కడే ఉండేవారని, కొన్ని నెలల కింద ఇల్లు ఖాళీ చేశారని ఓనర్లు సమాధానం ఇస్తునట్లు వివరిస్తున్నారు. కొందరికి ఫోన్ ​చేస్తే కలవడం లేదని చెబుతున్నారు. ఇలా అధికారులు చాలా అప్లికేషన్లను పక్కన పెట్టారు. ఉన్నతాధికారుల ఒత్తిడితో వెరిఫికేషన్​ను మరింత వేగవంతంగా చేశారు. ఉన్నోళ్లను కలిసి వివరాలు తీసుకుంటున్నారు. స్పందన లేకపోతే పక్కన పెడుతున్నారు. దాదాపు 2 లక్షల మంది దరఖాస్తుదారుల నుంచి స్పందన లేదంటున్నారు. త్వరలోనే వెరిఫికేషన్​ వివరాలను సంబంధిత కలెక్టర్లకు పంపనున్నారు.

మాన్యువల్​గా ఇచ్చినవి పట్టించుకోవట్లే..
మొదట్లో డబుల్ బెడ్రూం  ఇండ్ల కోసం కలెక్టర్ ఆఫీసులకు, జీహెచ్ఎంసీలకు మాన్యువల్​గా వచ్చిన అప్లికేషన్లను అధికారులు తీసుకున్నారు. తర్వాత మీసేవ ద్వారా అప్లయ్ చేసుకోవాలని సూచించారు. మీసేవల ద్వారా 7లక్షలకు పైగా రాగా, మరో లక్షకు పైగా మాన్యువల్​గా వచ్చాయి. అయితే ఇప్పుడు జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న వెరిఫికేషన్ లో మ్యానువల్​గా వచ్చిన అప్లికేషన్లు లేవు. వీరందరికీ ఇండ్లు వచ్చే అవకాశం లేదని కొందరు అధికారులు చెబుతున్నారు. అయితే జీహెచ్ఎంసీలో అందజేసిన అప్లికేషన్లను కలెక్టరేట్లకు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. తమ వివరాలు సేకరించేందుకు ఎవరూ రావడం లేదని కొందరు దరఖాస్తుదారులు రోజూ జీహెచ్ఎంసీ హెడ్డాఫీసుతోపాటు జోనల్, డిప్యూటీ కమిషనర్ ఆఫీసులు, కలెక్టరేట్, తహసీల్దార్ ఆఫీసులకు పరుగులు తీస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా కూడా సరైనా సమాధానం ఇవ్వడంలేదని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వెరిఫికేషన్​ నామమాత్రంగా జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

ఓటర్ ఐడీ కార్డు మస్ట్ అందుకేనా?
వెరిఫికేషన్​లో భాగంగా జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రస్తుతం సేకరిస్తున్న వివరాల్లో ఓటర్ ఐడీ కార్డు మస్ట్​అంటున్నారు. అలాగే అప్లయ్​ చేసిన టైంలో ఏవైనా వివరాలు పొందుపర్చకపోతే వాటిని తీసుకుని ఆవాస్ యాప్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఓటర్ ఐడీ ఎపిక్ నంబర్​తోపాటు నియోజకవర్గాన్ని ఎంట్రీ చేస్తున్నారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం గ్రేటర్ పరిధిలో లక్ష డబుల్​ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ప్రకటించగా, జీహెచ్ఎంసీ 90,172 ఇండ్లు నిర్మించింది. వీటి కోసం 7.10లక్షల మంది అప్లయ్​చేసుకున్నారు. వీరిలో ఇతర జిల్లాల వారు ఉంటే అప్లికేషన్లను ఆ జిల్లాలకు ట్రాన్స్ ఫర్ చేసేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అప్లికేషన్ల ఏరివేత కోసమే ఓటర్​ కార్డు మస్ట్ ​అంటున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

‘‘నాంపల్లి మండలానికి చెందిన లక్ష్మీబాయి 2018 డిసెంబర్​లో డబుల్​
బెడ్రూం ఇల్లు కోసం మీసేవలో అప్లయ్ చేసుకుంది. ప్రస్తుతం ఓటర్ ఐడీ వివరాల కోసం తమ వద్దకు ఎవరు రాలేదని, తమ ఫోన్ నంబర్​కు కాల్ కూడా చేయలేదని ఇటీవల హైదరాబాద్ కలెక్టరేట్​కు వచ్చింది. ఆమెకు అక్కడ సరైన సమాధానం దొరక్క తిరిగి వెళ్లిపోయింది.’’‘‘టోలిచౌకికి చెందిన ఫాతిమా డబుల్ బెడ్రూం ఇల్లు కోసం జీహెచ్ఎంసీ ఆఫీసుకు వెళ్లి అప్లయ్ చేసుకుంది. ఆ అప్లికేషన్​ను బల్దియా అధికారులు కలెక్టరేట్​కు పంపారు. ప్రస్తుతం వెరిఫికేషన్​కోసం తమ వద్దకు ఎవరూ రావడం లేదని చెప్పింది. తమ వద్ద మరో అప్లికేషన్​ కాపీ లేదని తెలిపింది.’’

అన్నింటినీ సమానంగా చూడాలి
మీ సేవ నుంచి వచ్చిన అప్లికేషన్లను, మాన్యువల్​గా వచ్చిన వాటిని ఒకేలా చూడాలి. మాన్యువల్​గా అందజేసిన వాటిని పక్కన పెట్టేటట్లయితే అప్పట్లో ఎందుకు తీసుకున్నారు. ఆరేండ్ల కింద దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మంది ఇండ్లు మారారు. కరోనా రాక ముందు అయితే అంతా దరఖాస్తు చేసుకున్నప్పటి అడ్రస్​లలోనే ఉండేవారు. వరుస లాక్​డౌన్​లు, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ ​అయ్యారు. ప్రతి ఒక్కరినీ గుర్తించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఎవ్వరూ ఇతర దేశాలకు వెళ్లలేదు. సిటీలోనే ఉంటున్నారు. ఈ అంశంపై మంత్రి 
కేటీఆర్​ను నిలదీస్తాం.
- శివచంద్రగిరి, బీజేవైఎం సిటీ అధ్యక్షుడు