ఒకప్పుడు రోజుకు 10 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సీఎం కేసీఆర్ చొరవ వల్ల నాలుగు కోట్లకు తగ్గిందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. ఈ నష్టాన్ని భవిష్యత్తులో పూర్తిగా అధిగమిస్తామన్నారు. రాష్ట్రంలోని 91 డిపోల్లో 40 డిపోలు లాభాల్లోకి వచ్చాయన్నారు. భవిష్యత్తులో ఆర్టీసీ సిబ్బందికి జీతాలిచ్చేందుకు ఇబ్బందులుండేవని.. కానీ సీఎం కేసీఆర్ చొరవతో ఆ పరిస్థితి లేదన్నారు. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ సహా డిపోలను ఆయన పరిశీలించారు.
ఆర్టీసీకి ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు.. కార్గో, లాజిస్టిక్, ఇతర సేవల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నామని బాజిరెడ్డి తెలిపారు. లాజిస్టిక్ ద్వారా గత రెండేళ్లలో 200 కోట్ల రాబడి వచ్చిందన్నారు. అదనపు డీఎల్ ద్వారా ఒక్కో ఉద్యోగికి 6నుంచి ఏడువేల ఆదాయం వస్తోందని చెప్పారు. రోజుకు 14 కోట్ల ఆదాయం వస్తోందని.. మరో నాలుగు కోట్లు పెరిగితే నష్టాల నుంచి బయటపడుతామన్నారు. బస్టాండ్లలో ప్రయాణికులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
టీఎస్ ఆర్టీసీకి మంచి భవిష్యత్తు ఉందని బాజిరెడ్డి అన్నారు. 760 కొత్త బస్సులు కొనుగోలు చేశామన్న ఆయన మరో 300 ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. సిబ్బంది కష్టంతో పాటు ప్రయాణికులు ఆదరిస్తుండడంతో ఆర్టీసీ కోలుకుంటోందన్నారు. కరీంనగర్ జోన్ లో గత 561 కోట్లు నష్టం ఉంటే.. ఈసారి 156 కోట్లు మాత్రమే నష్టం వచ్చినట్లు వెల్లడించారు.