
- కార్మికుల సొంతింటి కోసం రూ.15 లక్షల వడ్డీ లేని లోన్
- కాంగ్రెస్‌ను గెలిపిస్తే చెన్నూర్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తం
- 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తం
- మెడికల్ కేసులను నేరుగా హైదరాబాద్‌కు రెఫర్ చేస్తం
కాంగ్రెస్‌ను గెలిపిస్తే సింగరేణిలో అనుబంధ పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆ పార్టీ చెన్నూర్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూర్‌లో మైనింగ్ ఇన్స్టిట్యూట్, మూడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, సిరామిక్ టైల్స్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ, అగ్రి రీసెర్చ్ సెంటర్ల ద్వారా 40 వేల జాబ్స్కల్పిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ‘‘కాంగ్రెస్‌ను గెలిపిస్తే సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తం. రూ.15 లక్షల వడ్డీ లేని లోన్ ఇప్పిస్తం. మందమర్రి, రామకృష్ణాపూర్ ఏరియాలో 100 బెడ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తం. సింగరేణి నుంచి మెడికల్ రెఫరల్ కేసులు నేరుగా హైదరాబాద్ వెళ్లడానికి చర్యలు తీసుకుంటం” అని ఆయన తెలిపారు.
శుక్రవారం వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. బాల్క సుమన్ ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉండి చెన్నూర్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని అన్నారు. ‘‘బాల్క సుమన్ ఎన్నడూ గ్రామాల్లో తిరగలే. ప్రజల సమస్యలు పట్టించుకోలే. ఆయనకు ఇసుక లారీలు లెక్క పెట్టుకోవడమే సరిపోయింది” అని విమర్శించారు. ఇప్పటి వరకు సుమన్ ను చూడలేదని చాలామంది చెన్నూర్ ప్రజలు తనతో చెప్పారని అన్నారు. ‘‘నేను మాత్రం అధికారంలో ఉన్నా లేకున్నా వారానికి రెండు రోజులు పర్యటించిన. విశాక చారిటబుల్ ట్రస్ట్, కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన” అని ఆయన వివరించారు. ఏ ఊరికి వెళ్లినా బాల్క సుమన్ తాగునీళ్లు కూడా ఇవ్వలేదని ప్రజలు నీళ్ల సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.
తాను ఎంపీగా ఉన్నప్పుడు రూ.14 కోట్లతో చెన్నూర్ లో మంచి నీటి సరఫరా పథకం తెచ్చానని చెప్పారు. మందమర్రి, రామకృష్ణాపూర్లో కూడా కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధే ఇప్పటికీ కనిపిస్తున్నదని అన్నారు. తన హయాంలో రూ.38 కోట్లతో శాంక్షన్ చేసిన క్యాతన్‌పల్లి ఆర్వోబీని పదేండ్లయినా సుమన్ పూర్తి చేయలేదని, కేవలం సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి రూ.వేల కోట్లతో డెవలప్మెంట్ చేసినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల వైపే ఉన్నారని, అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి అంశాన్ని కార్యాచరణలో పెడుతామని, చెన్నూర్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.
బీజేపీ, బీఆర్ఎస్ వల్లే సింగరేణి ప్రైవేటీకరణ: జనక్‌ప్రసాద్
బీజేపీ, బీఆర్ఎస్లే సింగరేణి ప్రైవేటీకరణకు కారణమని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్ అన్నారు. 2015లో కేంద్ర ప్రభుత్వం కోల్‌మైన్స్ వేలం బిల్లును తీసుకొచ్చిందని తెలిపారు. ఆ బిల్లుకు బీఆర్ఎస్ ఎంపీలు 13 మంది ఆమోదం తెలిపారన్నారు. వారిలో బాల్క సుమన్, కవిత కూడా ఉన్నారని చెప్పారు వాళ్లే ఇప్పుడు కాంగ్రెస్ ను బద్నామ్ చేస్తున్నారని ఆయన అన్నారు. సింగరేణి బకాయిలు రూ.30వేల కోట్లను కేసీఆర్ స్వలాభం కోసం వాడుకున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారసత్వ నియామకాలు వచ్చాయని, ఇందులో కేసీఆర్ చేసిందేమీ లేదని అన్నారు. ప్రెస్మీట్లో పీసీసీ జనరల్ సెక్రటరీ పల్లె రఘునాథ్‌రెడ్డి, అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్ పాల్గొన్నారు.