
- ప్రస్తుతం సాగర్, శ్రీశైలంలో అందుబాటులో 60 టీఎంసీలు
- నీటిని పొదుపుగా వాడుకోవాలని రెండు రాష్ట్రాలకు సూచన
- ఏపీకి 16 టీఎంసీలే ఇవ్వాలని తెలంగాణ డిమాండ్
- రెండు వారాలు కీలకమన్న ఏపీ.. 23 టీఎంసీలకు పట్టు
- రెండు వారాల తర్వాత ఈఎన్సీలు సమావేశమవ్వాలని సూచన
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న 60 టీఎంసీల్లో తెలంగాణ 40 టీఎంసీలు, ఏపీ 20 టీఎంసీలు వాడుకునేలా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు రెండు రాష్ట్రాలకు సిఫార్సు చేసింది. వచ్చేది ఎండాకాలం కావడంతో రెండు రాష్ట్రాలూ నీటిని పొదుపుగా వాడుకోవాలని, తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించింది. గురువారం జలసౌధలో ఇరు రాష్ట్రాల సెక్రటరీలు, ఈఎన్సీలు, అధికారులతో బోర్డు చైర్మన్ అతుల్ జైన్ సమావేశమయ్యారు. బుధవారమే సమావేశం నిర్వహించాల్సి ఉన్నా.. ఏపీ అధికారులు హాజరు కాకపోవడంతో గురువారం ఏర్పాటు చేశారు. దీనికి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు, అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా 63 టీఎంసీలు కావాలని తెలంగాణ, 55 టీఎంసీలు కావాలని ఏపీ.. బోర్డుకు ఇండెంట్ పెట్టాయి. ఏపీకి ఉన్న వాటా కేవలం 23 టీఎంసీలేనని.. ప్రస్తుతం 16 టీఎంసీలు ఇవ్వాలని బోర్డుకు తెలంగాణ స్పష్టం చేసింది. తమకింకా 130 టీఎంసీలు రావాల్సి ఉందని పేర్కొంది. దీనిపై స్పందించిన ఏపీ అధికారులు.. వచ్చే రెండు వారాలు తమకు కీలకమని, ఇలాంటి సమయంలో 16 టీఎంసీలు సాగుకు సరిపోవని వాదించారు. 23 టీంఎసీలు ఇవ్వాలని పట్టుబట్టారు. ఆయకట్టు ఎండకుండా నీటిని ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాలకు 40 టీఎంసీలు, 20 టీఎంసీల చొప్పున నీటిని వాడుకునేలా బోర్డు సూచించింది.
తాగునీటికి ఇబ్బందులు రావొద్దు
ఎండాకాలంలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా వాడుకోవాలని రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచించింది. సాగర్లో 515 అడుగులు, శ్రీశైలంలో 820 అడుగుల వరకే సాగునీటిని వాడుకోవాలని, ఆ తర్వాత తాగునీటికి వినియోగించుకోవాలని తెలిపింది. ఏపీ సాగర్ కుడి కాల్వ ద్వారా ప్రస్తుతం 7 వేల క్యూసెక్కులను డ్రా చేస్తున్నదని, దానిని 5 వేల క్యూసెక్కులకు తగ్గించాలని తెలంగాణ అధికారులు బోర్డును కోరారు. వారం వరకు 7 వేల క్యూసెక్కులను తీసుకుంటామని, ఆ తర్వాత తగ్గిస్తామని, ఇప్పుడు సాగర్ కింద ఆయకట్టుకు నీటి అవసరం చాలా ఉందని ఏపీ వివరించింది. అయితే, మీటింగ్లను లేట్ చేస్తూ వచ్చిన ఏపీ.. ఈ వారం రోజుల్లోనే సాగర్ కుడి కాల్వ ద్వారా 7 టీఎంసీల నీటిని తీసుకున్నదని తెలిసింది. మరోవైపు ఎడమ కాల్వ ద్వారా ప్రస్తుతం తెలంగాణ 9 వేల క్యూసెక్కులను డ్రా చేస్తుండగా.. శ్రీశైలం నుంచి 2,400 క్యూసెక్కులను తీసుకుంటున్నది.