- ఫోన్ ట్యాపింగ్‌లో బయటపడ్తున్న వికృత కోణాలు
- నల్గొండ జిల్లాలో ప్రణీత్‌రావు టీమ్ ఆగడాల
- మహిళలను బెదిరించి లైంగికంగా వేధించిన కానిస్టేబుల్
- రౌడీషీటర్లతో కలిసి ల్యాండ్ సెటిల్మెంట్లు
- గంజాయి కేసులో ప్రముఖ లీడర్లను బెదిరించి వసూళ్లు
హైదరాబాద్/నల్గొండ అర్బన్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో ఓ వార్రూమ్ఏర్పాటు చేసి, ప్రముఖుల ఫోన్లను ట్యాప్చేసిన ప్రణీత్‌రావు టీమ్‌లోని ఇద్దరు కానిస్టేబుళ్లను హైదరాబాద్ పోలీసులు కొద్దిరోజుల కింద అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను విచారిస్తే కండ్లు బైర్లు గమ్మే నిజాలు బయటకు వచ్చాయి. ఫోన్ల ట్యాపింగ్ద్వారా కొందరి రహస్యాలు, బలహీనతలను తెలుసుకున్న ఓ కానిస్టేబుల్... దాదాపు 40 మందికి పైగా మహిళలను లైంగికంగా వేధించినట్టు తెలుస్తున్నది.
నల్గొండ కేంద్రంగా ఫోన్లను ట్యాపింగ్చేసిన టాస్క్ఫోర్స్టీమ్లో ఓ కానిస్టేబుల్కీలకంగా వ్యవహరించాడు. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు పలువురు ప్రతిపక్ష లీడర్ల ఫోన్లను ట్యాప్చేసిన సదరు కానిస్టేబుల్.. పనిలో పనిగా తన పని కూడా కానిచ్చాడు. పలువురు వీఐపీ మహిళలతో పాటు కొందరు తెలిసిన మహిళల ఫోన్లను ట్యాప్చేశాడు. సదరు మహిళలు ఫోన్లలో మాట్లాడినప్పుడు వారి రహస్యాలు, బలహీనతలు తెలుసుకున్న అతడు.. వారిని బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు సమాచారం.
ఇలా సుమారు 40 మందికి పైగా మహిళలను లైంగికంగా వేధించినట్టు తెలుస్తున్నది. అలాగే రౌడీషీటర్స్, గంజాయి, ఇతర ఇల్లీగల్ దందాలు చేసే వారి ఫోన్లను ట్యాప్‌చేసి ల్యాండ్ సెటిల్మెంట్స్చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఓ పోలీస్అధికారికి గుర్రంపోడు సమీపంలో సుమారు పదెకరాల భూమి కొనిచ్చినట్టు తెలిసింది. నార్కట్‌పల్లి వద్ద ఓ గంజాయి కేసులో ప్రముఖులైన ఇద్దరు లీడర్లను, ఇంకొంత మంది వ్యక్తులను బెదిరించి భారీగా సొమ్ము చేసుకున్నట్టు సమాచారం.
నాలుగో రోజు కస్టడీలో రాధాకిషన్ రావు..
టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆదివారం నాలుగో రోజు పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలిసింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ పూర్తిగా అనధికారిక కార్యకలాపాలే నిర్వహించినట్టు విచారణలో తేలింది. ప్రతి ఎలక్షన్ సమయంలో ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్ కేంద్రంగానే డబ్బుల పట్టివేత, రవాణా జరిగినట్టు స్పెషల్ టీమ్ పోలీసులు ఆధారాలు సేకరించినట్లు సమాచారం.
రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్స్ 3 కమిషనరేట్ల మధ్య చిచ్చు పెట్టాయి. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో గతంలో టాస్క్‌ఫోర్స్‌పోలీసులు శివారు ప్రాంతాల్లో పలు దాడులు చేశారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఆపరేషన్స్ నిర్వహించారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే సోదాలు, అరెస్టులు చేయడంతో అంతర్గత వివాదం తలెత్తినట్టు తెలిసింది.
ప్రణీత్ రావు నుంచే స్పెషల్ ‘టాస్క్’..
టాస్క్‌ఫోర్స్ డీసీపీగా రాధాకిషన్ రావు ఏడేండ్లు పని చేశారు. పదవీ విరమణ పొందిన తరువాత కూడా ఓఎస్‌డీగా అక్కడే బాధ్యతలు నిర్వర్తించారు. దాదాపు నాలుగేండ్లు పని చేశారు. బీఆర్‌ఎస్ కు అనుకూలంగా ప్రతిపక్ష పార్టీలను కట్టడి చేసేందుకే రాధాకిషన్‌రావు ఓఎస్‌డీగా పని చేసినట్టు ఇప్పటికే పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదంతా గత ప్రభుత్వం
ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలో జరిగినట్టు రాధాకిషన్ రావు పోలీసుల ముందు అంగీకరించారు. ఇందుకు సంబంధించిన స్టేట్‌మెంట్స్‌ను కస్టడీ విచారణలో పోలీసులు రికార్డ్ చేశారు. ప్రణీత్‌రావు నుంచి సెర్చ్ ఆపరేషన్స్‌కు సంబంధించిన టాస్క్ వచ్చేదని రాధాకిషన్ రావు వెల్లడించినట్టు సమాచారం