
బెంగుళూరు: కర్నాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన ఫ్యామిలీలోని ముగ్గురిని కాల్చి చంపి ఆ తర్వాత అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిక్కమగళూరు జిల్లాలోని మగలు గ్రామంలో మంగళవారం (ఏప్రిల్ 2) రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. రత్నాకర్ గౌడ (40) అనే వ్యక్తి ఓ ప్రైవేట్ పాఠశాలలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా రత్నాకర్‌కు అతడి భార్యకు మధ్య గొడవలు నడుస్తున్నాయి. దీంతో ఆమె రత్నాకర్‌ను వదిలిపెట్టి రెండేళ్లుగా దూరంగా ఉంటుంది.
తన భార్య తనకు దూరం కావడానికి అత్తగారి ఫ్యామిలీనే కారణమని.. వారిని ఎలాగైనా అంతమొదించాలని రత్నాకర్ ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 1) తుపాకీ తీసుకుని అత్తగారింటికి వెళ్లిన రత్నాకర్.. అత్త జ్యోతి (50), వదిన సింధు (24), ఆమె కుమార్తె మౌల్య (6) లను కాల్చి చంపాడు. మధ్యలో అడ్డువచ్చిన సింధు భర్త అవినాష్ (38) కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వీళ్లను హత్య చేసిన అనంతరం అదే తుపాకీతో కాల్చుకుని రత్నాకర్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు ముందు రత్నాకర్ ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వీడియోలో.. అత్తగారి ఫ్యామిలీ తనను మోసం చేసిందని.. వీళ్ల వల్లే నా భార్య నాకు దూరమైందని రత్నాకర్ ఆరోపించాడు.
ఈ కోపంతోనే అత్తగారి ఫ్యామిలీని హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలోనే పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. రత్నాకర్ కు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు.