యూనియన్ ​కార్బైడ్ ​వ్యర్థాల తరలింపు షురూ

యూనియన్ ​కార్బైడ్ ​వ్యర్థాల తరలింపు షురూ
  • 40 ఏండ్ల తర్వాత స్థానికులకు ఊరట  

భోపాల్: మధ్యప్రదేశ్​లోని భోపాల్ ప్రజలకు 40 ఏండ్లుగా నరకం చూపిస్తున్న యూనియన్ కార్బైడ్ వ్యర్థాల తరలింపును ఆ రాష్ట్ర సర్కారు షురూ చేసింది. మొత్తం 377 టన్నుల ప్రమాదకర వ్యర్థాలను సీల్​చేసి, ట్రక్కులో లోడ్ చేసి తరలిస్తున్నట్టు ఓ అధికారి బుధవారం రాత్రి మీడియాకు తెలిపారు. ఈ వేస్టేజ్​ను 250 కిలోమీటర్ల దూరంలో పారబోయనున్నట్టు చెప్పారు. ఇండోర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక ప్రాంతాన్ని ఇందుకోసం ఎంచుకున్నట్టు చెప్పారు. 12 కంటైనర్ ట్రక్కులు వ్యర్థాలను మోసుకెళ్తున్నాయని తెలిపారు. ప్రయాణం సాఫీగా సాగేందుకు ఆ మార్గంలో గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేశామన్నారు. 

అయితే, అక్కడకు తీసుకు వెళ్లిన విష వ్యర్థాలను ప్రత్యేకంగా కాల్చి.. ఆ తర్వాత వచ్చే బూడిదలో ఏవైనా ప్రమాదకర రసాయానాలు ఉన్నాయోమోనని నిపుణుల ద్వారా పరీక్షలు చేయిస్తామని వెల్లడించారు. ఏమీ లేనట్లు తేలితే వాటిని భూమిలో పాతి పెడతామని అన్నారు. 40 ఏండ్ల క్రితం భోపాల్ నగర శివార్లలోని యూనియన్ కార్బైడ్ పురుగు మందుల కర్మాగారంలోంచి అత్యంత ప్రమాదకరమైన మిథైల్ ఐసోసైనేట్(ఎంఐసీ) గ్యాస్ లీకైంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 25 వేల మంది దీని వల్ల ప్రాణాలు కోల్పోగా.. 6 లక్షలకు పైగా మంది తీవ్ర అనారోగ్యంతో బాధితులుగా మిగిలారు.