అది పరిశ్రమలకు కేటాయించిన భూమి.. కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో అడ్వకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ వాదన

అది పరిశ్రమలకు కేటాయించిన భూమి.. కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో అడ్వకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ వాదన
  • పిటిషనర్లు ఒక్క గూగుల్‌‌‌‌మ్యాప్‌లు తప్ప ఎలాంటి ఆధారాలు చూపలేదు
  • కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో అడ్వకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ వాదన
  • రెవెన్యూ, అటవీ, పక్షిజాతుల గణాంకాలకు సంబంధించిన ఏ రికార్డూ చూపలేదని వెల్లడి
  • పర్యావరణ విధ్వంసం జరుగుతున్నదన్న పిటిషనర్లు
  • ఒక్కరోజు పనులు ఆపాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశం
  • విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల స్థలాన్ని పరిశ్రమలకే కేటాయించినట్లు అడ్వకేట్‌‌ జనరల్‌‌ ఎ.సుదర్శన్‌‌ రెడ్డి కోర్టుకు తెలిపారు.  2006 నుంచి ఇది పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూమిగానే ఉందని వెల్లడించారు.  కంచ గచ్చిబౌలి సర్వే నెం.25లో 400 ఎకరాలను టీజీఐఐసీకి కేటాయిస్తూ ప్రభుత్వం నిరుడు జూన్‌‌ 26న జారీ చేసిన జీవో 54ను సవాలు చేస్తూ హైదరాబాద్‌‌కు చెందిన కె.బాబూరావు, వటా ఫౌండేషన్‌‌ వేర్వేరుగా దాఖలు చేసిన పిల్‌‌లపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది.

తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ సుజయ్‌‌పాల్, జస్టిస్‌‌ యారా రేణుకతో కూడిన ధర్మాసనం ముందు ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. ప్రభుత్వం తరఫున అడ్వకేట్​జనరల్​ ఎ.సుదర్శన్​రెడ్డి వాదించారు. ఇక్కడ పిటిషనర్లు కేవలం ఒక్క గూగుల్‌‌ మ్యాప్‌‌లు తప్ప ఎలాంటి ఆధారాలు చూపడంలేదని చెప్పారు. ఈ భూమికి సంబంధించి రికార్డుల్లో ఏముందన్న ఒక్క ఆధారమూ సమర్పించలేదని తెలిపారు. రెవెన్యూ, అటవీ, పక్షిజాతుల గణాంకాలకు సంబంధించిన ఏ రికార్డూ లేదని అన్నారు. 

2003లో ఇక్కడ ఎకరం రూ.20 లక్షలుండగా.. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఐఎంజీ అకాడమీస్‌‌ భారతకు రూ.50 వేలకు విక్రయించిందన్నారు. నామినేషన్‌‌ పద్ధతిన తక్కువ ధరకు 400 ఎకరాలను తాత్కాలిక ప్రభుత్వం కేటాయించడంతో.. తర్వాత వచ్చిన ప్రభుత్వం విక్రయ ఒప్పందాన్ని చట్టం ద్వారా రద్దు చేసిందని తెలిపారు.  ఆ చట్టాన్ని సవాల్​ చేస్తూ ఐఎంజీ హైకోర్టును ఆశ్రయించగా.. చట్టాన్ని సమర్థిస్తూ తీర్పు వెలువడిందని చెప్పారు.  దీన్నే సుప్రీంకోర్టు కూడా ధ్రువీకరించిందన్నారు. ఐఎంజీకి భూమిని కేటాయించినప్పుడు ప్రస్తుత పిటిషనర్లు ఎవరూ అభ్యంతరం కూడా చెప్పలేదని తెలిపారు. ఈ భూమి కోసం ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తుంటే వీరెవరూ ప్రతివాదులుగా చేరలేదని అన్నారు.  

ప్రభుత్వ జీవో సుప్రీం తీర్పునకు విరుద్ధం: పిటిషనర్ల తరఫు లాయర్లు
పిటిషనర్ల తరఫున సీనియర్‌‌ న్యాయవాదులు ఎల్‌‌.రవిచందర్, ఎస్‌‌.నిరంజన్‌‌రెడ్డి వాదనలు వినిపించారు.  ప్రభుత్వం జారీ చేసిన జీవో టి.ఎన్‌‌. గోదావర్మన్‌‌ తిరుమల్‌‌పాడ్‌‌ వర్సెస్‌‌ కేంద్రం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వ రికార్డుల్లో అది అటవీ ప్రాంతంగా నమోదుకాకపోయినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెట్లు, పక్షులు ఉన్న ప్రాంతాన్ని అటవీ ప్రాంతంగా పరిగణించాల్సి ఉంది.

ఈ అటవీ ప్రాంతంలో 734 రకాల పూల మొక్కలు, 10 రకాల క్షీరదాలు, 15 రకాల సరీసృపాలు, 233 జాతుల పక్షలున్నాయి.  మంజీరా నీటి ప్రవాహం కూడా ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇందులో సరస్సులున్నాయి. ఇలాంటి ప్రాంతంలో అభివృద్ధి పనుల పేరుతో కేటాయింపులు జరుపుతున్నపుడు కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం జరిపించాల్సి ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రభుత్వం మార్చి 15న కమిటీని ఏర్పాటు చేసినట్లు పత్రికల్లో వచ్చింది. 

ఇందులో సీసీఎల్‌‌ఏ, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, జీహెచ్‌‌ఎంసీ కమిషనర్‌‌ తదితరులున్నట్లు తెలిసింది. దీన్ని ఏజీ ధ్రువీకరించాల్సి ఉంది”అని చెప్పారు. అటవీ ప్రాంతంలో పనులు చేపట్టే ముందు 50 ఎకరాలు మించితే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి అవసరమని పేర్కొన్నారు. వాల్టా చట్టం ప్రకారం 3 అడుగులు పెరిగిన ఒక్క చెట్టును కొట్టాలన్నా అధీకృత అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉందని తెలిపారు. కోర్టులో కేసు పెండింగ్‌‌లో ఉండగానే జేసీబీలు, ప్రొక్లెయినర్లతో 200 ఎకరాల్లో అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసిందని తెలిపారు.  కోర్టు సమయం ముగిసిపోవడంతో ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది. అప్పటివరకూ కంచ గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక్కరోజు పనులు నిలిపివేయాలని ఆర్డర్​ వేసింది. ఈ వివాదానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై గురువారం మధ్యాహ్నం విచారణ చేపడతామని చెప్పింది.

గత సర్కారుకు ఎవరూ అడ్డుచెప్పలే..
ఇక్కడ నెమళ్లు, ముంగీసలు తిరుగుతున్నందున దీన్ని అటవీ ప్రాంతంగా ప్రకటించాలని పిటిషనర్లు అంటున్నారని, అలాగైతే యూనివర్సిటీ మొత్తాన్ని అటవీ ప్రాంతంగా ప్రకటిం చాల్సి ఉంటుందని ఏజీ సుదర్శన్ ​రెడ్డి అన్నారు. ఇటీవలే 5 ఎకరాల్లో పెద్ద భవనాన్ని యూనివర్సిటీ నిర్మించిన విషయాన్ని గమనించాలన్నారు. ‘‘గత  ప్రభుత్వం పెద్దఎత్తున భూములను విక్రయించినా ఎవరూ స్పందించలేదు. ఇది యూనివర్సిటీ పక్కన ఉంది. ఇందులో 4 హెలిప్యాడ్‌‌లు ఉన్నాయి. రక్షణ శాఖ మంత్రి కూడా ఇక్కడ దిగారు. గూగుల్‌‌ మ్యాప్‌‌ను చూస్తే ఇవన్నీ ఉంటాయి. ఇది కంచ భూమి.

నగరానికి నలువైపులా గడ్డి కోసం నిజాం ఈ భూములు కేటాయించారు. సర్వే నెం.25 పీలో బస్సు డిపోలకు 9.91 ఎకరాలు, బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌కు ఎకరం, నవోదయ స్కూల్​కు 31, మండల కాంప్లెక్స్‌‌కు 5, స్పోర్ట్స్‌‌ అథారిటీకి 117.16, ట్రిపుల్​ ఐటీకి 62 ఎకరాలు, టీజీఐఐసీకి 400 ఎకరాల కేటా యింపు జరిగింది. టీఎన్జీవో హౌసింగ్‌‌ సొసైటీకి 134 ఎకరాలు, రోడ్డు నిర్మాణానికి 31, 3 సబ్‌‌ స్టేషన్లకు 12.25 కేటాయించారు. హైదరాబాద్‌‌ సెంట్రల్‌‌ వర్సిటీకి 2,374 ఎకరాలు కేటాయించగా..  1,490 ఎకరాలు వర్సిటీ స్వాధీనంలో ఉంది”అని చెప్పారు.