జీడిమెట్లలో భారీగా గంజాయి పట్టుబడింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బాలనగర్ ఎస్ఓటి పోలీసులు డిసెంబర్ 16వ తేదీ శనివారం తనిఖీలు నిర్వహించి.. నర్సరీ చెట్ల రవాణా పేరుతో డీసీఎంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. డీసీఎంలో తరలిస్తున్న 400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం షాపూర్ నగర్ లోని కార్యాలయంలో డీసీపీ శ్రీనివాసరావు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు తెలిపారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ర్టకు డీసీఎంలో ఎండు గంజాయి తరలిస్తుండగా .. పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగిన బాలనగర్ ఎస్ఓటి పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. డీసీఎంతోపాటు రెండు ముబైల్ ఫోన్లు, నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. మార్కెట్ లో ఈ గంజాయి విలువ దాదాపు రూ. కోటి ఉంటుందని తెలిపారు. ఒడిశాకు చెందిన బబ్లూ, మహారాష్ట్రకు చెందిన గోవింద్ పటిదార్ అనే ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భారీ గంజాయి రవాణాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవరించిన బాలనగర్ ఎస్ఓటి సిఐ రాహుల్ దేవ్, పోలీసులను డీసీపీ అభినందించారు.