మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి మండలం పెద్దపూర్ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో ఎనిమిదవ తరగతి స్టూడెంట్ ఘనాదిత్య క్లాస్ రూమ్‌లోనే అస్వస్థతకు గురై చనిపోగా, అదే రూములో ఉన్న మరో ఇద్దరు స్టూడెంట్లు గణేశ్, హర్షవర్ధన్ లు సైతం అస్వస్థతకు గురై హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే.. ఈ రెండు సంఘటనలతో పేరెంట్స్ భయాందోళనతో తమ పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్లిపోతున్నారు. రెండు రోజుల్లో సుమారు 400 మంది స్టూడెంట్స్ హాస్టల్ నుంచి ఇంటికెళ్ళిపోయారు.
గురుకులంలో ఇదీ దుస్థితి..
- పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి ఏండ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ బిల్డింగ్‌కు రిపేర్లు చేయలేదు. భవనం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది.
- రేకుల షెడ్డులనే క్లాస్ రూమ్‌లుగా వాడుతున్నారు.
- ప్రత్యేక డార్మిటరీలు లేకపోవడంతో క్లాస్ రూములనే విద్యార్థులు డార్మిటరీలుగా వినియోగిస్తున్నారు.
- ఒక్కో రూములో సుమారు 40 మంది స్టూడెంట్స్ పడుకుంటారు.
- పిల్లలు పడుకునే రూముల్లో కిటికీలకు డోర్లు లేవు. పరిసరాల శుభ్రత లేదు. దీంతో తరచూ పాములు, విషపురుగులు వస్తున్నాయి.
- స్కూల్ పరిసరాల్లోకి చాలాసార్లు పాములు రావడంతో తామే చంపేసినట్లు పలువురు స్టూడెంట్లు చెబుతున్నారు.
- పేరెంట్స్ పలుమార్లు స్కూల్ ఉద్యోగులు, సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి.
- హాస్టళ్లలో విద్యార్థులను కనీసం పట్టించుకోవడం లేదని, ఆరోగ్యం పాడైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. వందలాది విద్యార్థులు ఉండే హాస్టళ్లు, గురుకులాల్లో రాత్రి విధుల్లో ఒక టీచర్‌మాత్రమే ఉంటుండగా ఒక్కరే కేర్ టేకర్ ఉన్నారు.