ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కొద్ది రోజులుగా భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 33,580 టెస్టులు చేయగా 4074 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,724కి చేరింది. అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 2,461 మంది, విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు 434 మంది ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 24,228 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 28,800 మంది రాష్ట్రంలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
700కి చేరువలో మరణాలు
ఏపీలో కొద్ది రోజులుగా కరోనా మరణాల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వారంలో దాదాపు ప్రతి రోజూ 40 మందికి పైగా మరణిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా కారణంగా 54 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున, కృష్ణా జిల్లాల్లో ఏడుగురు మృతి చెందారు. అనంతరపురంలో ఆరుగురు, చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు. కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 696కి చేరింది.