సౌదీ అరేబియాలో బయటపడ్డ 4 వేల ఏళ్ల నాటి పట్టణం

సౌదీ అరేబియాలో బయటపడ్డ 4 వేల ఏళ్ల నాటి  పట్టణం

సౌదీ అరేబియా వాయవ్య ప్రాంతంలోని ఒయాసిస్సులో నాలుగు వేల ఏండ్ల నాటి పురాతన పట్టణాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఖేబర్ ఒయాసిస్సు కింద కనుగొన్న ఈ పట్టణాన్ని అల్​ నతాహ్​గా పిలుస్తున్నారు. అప్పటి ప్రజలు సంచార జీవనం నుంచి నగర జీవనశైలికి ఎలా మారారన్న దానికి ఈ పట్టణం అద్దం పడుతుంది. 

ఫ్రెంచ్​ పురావస్తు శాస్త్రవేత్త గుయిలౌమ్​ చార్లక్స్​ నేతృత్వంలోని బృందం ఈ పట్టణాన్ని కనుగొన్నది.  2.6 హెక్టార్లలో నిర్మించిన ఈ పట్టణంలో 14.5 కిలోమీటర్ల పొడవైన పటిష్టమైన గోడ కూడా ఉన్నది. పీఎల్​వోఎస్ వన్ జర్నల్​లో ప్రచురితమైన ఇటీవలి అధ్యయనం ప్రకారం ఈ గోడను నివాస ప్రాంతం చుట్టూ నిర్మించారు. ఈ పట్టణం కాంస్య యుగం ప్రారంభంలో అంటే క్రీస్తు పూర్వం 2400 – 2000 సంవత్సరం నాటిదిగా గుర్తించారు. అప్పటి నుంచి క్రీస్తు పూర్వం 1500 నుంచి 1300 సంవత్సరాల వరకు ఈ పట్టణం కొనసాగి ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడ 500 మంది వరకు నివసించే వారని అంచనా వేస్తున్నారు.