![స్కిల్స్ లేక ఉద్యోగాలు దొరకట్లే..ఉపాధి కోసం గ్రామీణ యువత ఇబ్బందులు](https://static.v6velugu.com/uploads/2025/02/40percent-rural-youth-struggle-for-jobs-over-lack-of-skills-language-proficiency_X9mv1l4uoV.jpg)
న్యూఢిల్లీ: తగినన్ని స్కిల్స్ లేకపోవడం, ఇంగ్లిష్ వంటి భాషలపై పట్టులేకపోవడం వల్ల మనదేశం గ్రామీణ యువతలో దాదాపు 40 శాతం మంది ఉద్యోగాలు పొందేందుకు ఇబ్బంది పడుతున్నారని బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ కంపెనీ వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ రిపోర్ట్ పేర్కొంది. భాషలు రాకపోవడం పల్లెటూళ్ల యువతకు అతిపెద్ద సమస్యగా మారింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 1,200 మంది యువత నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ రిపోర్ట్‌ను తయారు చేశారు. 33 శాతం మంది రెస్పాండెంట్లు తమ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగాల కోసం యువత గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ కేంద్రాలకు వలస వెళ్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలను పొందడానికి అడ్డంకులుగా మారాయని 27 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పారు. ఎక్కువ జీతం గల ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవడానికి డబ్బులు లేవని పేర్కొన్నారు.