![మెక్సికోలో ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 41 మంది సజీవ దహనం](https://static.v6velugu.com/uploads/2025/02/41-killed-in-bus-accident-in-southern-mexico_0rK1eF623O.jpg)
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కును బస్సు ఢీకొని మంటలు చెలరేగడంతో 41 మంది సజీవ దహనమయ్యారు. కాంకున్ నుంచి టబాస్కో సిటీకి 48 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు.. శనివారం తెల్లవారుజామున ఎస్కార్సెగా సిటీకి దగ్గర్లో ట్రక్కును ఢీకొట్టింది. ఈ క్రమంలో మంటలు అంటుకుని బస్సు మొత్తం కాలిబూడిదైంది.
ఈ ఘటనలో బస్సులోని 38 మంది ప్యాసింజర్లు, ఇద్దరు డ్రైవర్లతో పాటు ట్రక్కు డ్రైవర్ సజీవ దహనమయ్యారు. మరికొంత మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయినోళ్లలో ఇప్పటి వరకు 18 మందిని గుర్తించామని తెలిపారు. మిగతా వాళ్లను గుర్తించాల్సి ఉందని చెప్పారు. ఈ ప్రమాదంపై బస్ ఏజెన్సీ విచారం వ్యక్తం చేసింది. బస్సు పరిమిత వేగంతోనే వెళ్తున్నదని, ప్రమాదానికి కారణమేంటో తెలుసుకునేందుకు అధికారులతో కలిసి పని చేస్తున్నామని పేర్కొంది.