సిల్ క్యారా టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..

సిల్ క్యారా టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్ కాశీ సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు చేసిన రెస్క్యూ టీమ్స్ ప్రయత్నాలు ఫలించాయి. ఎస్కేప్ పైపు ద్వారా ముందుగా నలుగురిని బయటకు తీసుకొచ్చారు. మిగతా వారిని కూడా తీసుకొస్తున్నారు. 

చార్‌ధామ్‌ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఈ సొరంగం నవంబర్ 12న కొంతభాగం కుప్పకూలడంతో కార్మికులు సొరంగంలోని ఖాళీ ప్రదేశంలో చిక్కుకున్నారు. దాదాపు 17 రోజుల పాటు వారిని కాపాడేందుకు అన్ని రకాల రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగాయి. వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత వెంటనే వైద్య చికిత్స అందించేందుకు సొరంగం లోపల తాత్కాలిక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని వాయు మార్గంలో తరలించేందుకు హెలికాప్టర్లను సిద్ధం చేశారు. 
 


మొత్తానికి కోట్లాది మంది భారతీయుల ప్రార్థనలు ఫలించాయి. 17 రోజుల పాటు విశ్రాంతి లేకుండా శ్రమపడ్డ సహాయక బలగాల కష్టానికి ఫలితం దక్కింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీలో సొరంగం పాక్షికంగా కుప్పకూలడంతో అందులో చిక్కుకుపోయిన 41 మంది కూలీలను ఎట్టకేలకు అధికారులు బయటకు తీసుకొస్తున్నారు. వారున్న ప్రాంతం వరకు డ్రిల్లింగ్‌ చేపట్టిన అధికారులు.. అందులోకి గొట్టాన్ని పంపించి దాని ద్వారా కూలీలు ఒక్కొక్కర్నీ బయటకు తీసుకొస్తున్నారు. 

కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యలను దాటి సహాయక సిబ్బంది వారి ప్రాణాలను కాపాడగలిగారు. సొరంగ శిథిలాల్లో 57 మీటర్ల పొడవునా గొట్టపు మార్గాన్ని వేయగలిగితే కూలీల వద్దకు చేరుకోవచ్చని గుర్తించిన అధికారులు.. అందుకోసం ఆగర్‌ యంత్రంతో డ్రిల్లింగ్‌ చేపట్టారు. ఈ మిషన్‌ 47 మీటర్లు తవ్విన తర్వాత.. ప్రమాదవశాత్తూ సొరంగంలోని ఇనుపపట్టీని ఢీకొట్టింది. దీంతో దీని బ్లేడ్లు విరిగిపోయి యంత్రం పనిచేయకుండా పోయింది. అయినా అధికారులు వెనకడుగు వేయలేదు. ప్రత్యామ్నాయంగా కొండపై నుంచి నిట్టనిలువుగా డ్రిల్లింగ్‌ పనులు చేపట్టారు. అదే సమయంలో సొరంగంలో చిక్కుకున్న ఆగర్‌ మిషన్‌ శిథిలాలను కట్టర్‌ సాయంతో తొలగించారు. ఆ తర్వాత 12 మంది ‘ర్యాట్‌ హోల్‌ మైనర్ల’ (బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులు)ను రంగంలోకి దించారు. మిగతా డ్రిల్లింగ్‌ పనిని వీరు మాన్యువల్‌గా చేపట్టారు.

సోమవారం (నవంబర్ 27న) రాత్రి నుంచి ఈ ర్యాట్‌ హోల్‌ మైనర్లు మెరుపు వేగంతో తవ్వకాలు చేపట్టడంతో 57 మీటర్ల డ్రిల్లింగ్‌ పూర్తయ్యింది. ఆ తర్వాత కూలీలు ఉన్న ప్రాంతం వరకు గొట్టాన్ని పంపించి అందులో నుంచి వారిని బయటకు తీసుకొస్తున్నారు. అప్పటికే సొరంగం వెలుపల సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌ల్లో కూలీలను ఆసుపత్రికి తరలిస్తున్నారు.