న్యూఢిల్లీ: భారత్‌లో అమ్మాయిలు ఫోన్‌లు వాడటం అంత సేఫ్ కాదని పేరెంట్స్ అనుకుంటున్నారు. రీసెంట్‌గా నిర్వహించిన ఓ స్టడీలో ఈ విషయం తేలింది. కొత్త స్టడీ ప్రకారం.. దేశంలో యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిల్లో 42 శాతం మంది రోజుకు గంట కంటే తక్కువ సేపు మొబైల్స్ వాడుతున్నారని తేలింది. ఫోన్ వాడకం అమ్మాయిలకు మంచిది కాదని, అదో అనారోగ్యకరమైన అలవాటని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ క్యాటలైజింగ్ ఛేంజ్ (సీ3) అనే ఎన్జీవో.. డిజిటల్ ఎమ్‌పవర్‌మెంట్ ఫౌండేషన్ (డీఈఎఫ్)తో కలసి ఈ స్టడీని చేపట్టింది. 10 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో 4,100 మందిని కలసి యంగ్ గర్ల్స్‌కు డిజిటల్ యాక్సెస్ ఎంత ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది. అస్సాం, హరియాణా, కర్నాటక, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణతోపాటు ఉత్తర్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్‌లో ఈ సర్వే నిర్వహించారు. యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలు డిజిటల్ యాక్సెస్‌లో పేరెంట్స్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని ఈ స్టడీలో వెల్లడైంది.
‘ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి మధ్య యువతుల డిజిటల్ యాక్సెస్ రేట్‌లో వైరుధ్యాలు ఉన్నాయి. కర్నాటకలో యుక్త వయస్సు అమ్మాయిలు మొబైల్ ఫోన్‌లు లేదా డిజిటల్ యాక్సెస్‌ను పెద్ద ఎత్తున వినియోగించుకున్నారు. ఆ రాష్ట్రంలో అమ్మాయిల డిజిటల్ యాక్సెస్ రేట్ 65 శాతంగా ఉంది. అదే హరియాణాలో డిజిటల్ యాక్సెస్‌లో అబ్బాయిలు ముందున్నారు. ఆ స్టేట్‌లో లింగ అంతరం ఎక్కువగా ఉంది. తెలంగాణకు వచ్చేసరికి అబ్బాయిలు, అమ్మాయిల డిజిటల్ యాక్సెస్‌లో స్వల్ప తేడా నమోదైంది. తల్లిదండ్రులు వారి పిల్లలకు ఇచ్చే స్వేచ్ఛ, అర్థం చేసుకునే తీరు, వారి ప్రవర్తనా తీరుపై ఈ విషయం ఆధారపడింది. కొన్ని కుటుంబాల్లో అబ్బాయిలకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్ వాడకానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నారు. కానీ అమ్మాయిలను మాత్రం వాటికి దూరంగా ఉంచుతున్నారు. కాగా, 81 శాతం కుటుంబాలు తమ పిల్లలకు ఫోన్ లేదా కంప్యూటర్స్‌ను కొనిచ్చే స్థోమత తమకు లేదని పేర్కొన్నాయి’ అని సర్వే వివరించింది. కౌమార దశలో ఉన్న అమ్మాయిలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను అందరి దృష్టికి తీసుకొచ్చి.. వాటిని పరిష్కరించడమే ఈ సర్వే ఉద్దేశమని తెలుస్తోంది.